పీవోకే ప్రజలారా భారత్ లో చేరండి.. రాజ్ నాథ్ ఓపెన్ పిలుపు
ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక పిలుపును ఇచ్చారు. పాక్ అక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్ లో కలవాలని ఆయన కోరారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మకశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కశ్మీరీ ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు అధికారం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక పిలుపును ఇచ్చారు. పాక్ అక్రమిత కశ్మీర్ ప్రజలు భారత్ లో కలవాలని ఆయన కోరారు.
పాకిస్థాన్ వారిని విదేశీయులుగా చూస్తున్నా.. తాము మాత్రం వారిని తమ సొంత మనుషుల్లా చూసుకుంటామన్న భరోసాను ఇవ్వటం గమనార్హం. జమ్ములో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన.. జమ్ముకశ్మీర్లో బీజేపీకి మద్దతు ఇస్తే.. స్థానికంగా మరిన్ని డెవలప్ మెంట్ పనులు చేపడతామన్నారు. తమకు పాకిస్థాన్ తో కలిసి ఉండటం ఇష్టం లేదని.. భారత్ కు వెళతామని పీవోకేలోని ప్రజలు చెప్పే స్థాయిలో డెవలప్ చేస్తామన్నారు.
పీవోకేను పాక్ ఒక విదేశీ భూభాగంగా చూస్తోందన్న విషయాన్ని పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ కూడా ఇటీవల ఒక పత్రంలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్ముకశ్మీర్ లో భద్రతా పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్న విషయాన్నివెల్లడించారు. ఒకప్పుడు పిస్తోళ్లు.. రివాల్వర్లతో తిరిగిన యువత చేతుల్లో ఇప్పుడు లాప్ టాప్ లు.. కంప్యూటర్లు ఉన్నాయన్నారు.
ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కూటమి హామీ ఇవ్వటాన్ని తప్పు పట్టిన రాజ్ నాథ్.. బీజేపీ ఉన్నంతవరకు అది సాధ్యం కాదన్నారు. స్నేహితుడ్ని మార్చుకోవచ్చు కానీ.. పొరుగువారిని మార్చుకోలేమన్న వాస్తవం తనకు తెలుసన్న ఆయన.. కశ్మీర్ ఉగ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారిలో 85 శాతం మంది ముస్లింలేనన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ఎన్నికల ప్రచార వేళ రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.