వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. 11 సీట్లకే పరిమితమైన వైసీపీని ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరిగా వీడుతుండడంతో జగన్ చేసేదేమీ లేక సైలెంట్ గా ఉన్నారు. ఇక, పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు పోతూ పోతూ జగన్ పై తాము ఐదేళ్లుగా దాచుకున్న అక్కసు వెళ్లగక్కి పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీకి ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే జగన్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు పదవి ఉన్నా పవర్ లేదని, ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని, అందుకే ఎమ్మెల్సీ పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తనకు పదవి ఇచ్చినందుకు జగన్ పై కృతజ్ఞత ఉందని, కానీ, తనకు ఒక్కసారి కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. తాను జగన్ ను కలిసేందుకు వెళితే సజ్జలతో మాట్లాడు, ధనుంజయరెడ్డితో మాట్లాడు అనేవారని, వారితో మాట్లాడి నాగేశ్వరారావుతో విభేదాలు లేకుండా చేసుకోవాలని సూచించారని అన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు కూడా ఎమ్మెల్సీ హోదాలో ఏదైనా విషయంపై పోలీస్ స్టేషన్ కు తాను ఫోన్ చేసినా విలువ లేదని, ఫలానా వ్యక్తితో మాట్లాడమని పోలీసులు తనకు చెప్పేవారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఏడాది కాలంలో కూడా తాను ఏ వైసీపీ కార్యకర్తకు పనిచేయలేకపోయానని, తనకు పదవి ఇచ్చినా పవర్ ఇవ్వలేదని, తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లేరు ప్రజల కోసం, కొల్లేరు నీటి సమస్య కోసం పోరాడానని, దానికి న్యాయం చేయమని జగన్ ను కోరినా ధనుంజయరెడ్డితో మాట్లాడమన్నారని విమర్శించారు.
కొల్లేరు ప్రజల కోసం గతంలో గోచీ పెట్టి పోరాడానని, ఇపుడు రైతు కోసం ఆమరణ దీక్ష చేయాలన్నా ఏం చేయాలన్నా పార్టీ అడ్డువస్తోందని చెప్పారు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని అన్నారు. తనకు వ్యక్తిగతంగా ఇమేజ్ ఉందని, పార్టీ స్టాంప్ లేకుంటే అధికారుల దగ్గర కూడా తనకు విలువ ఉంటుందని అన్నారు. చాలాకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్న జయమంగళ వెంకట రమణ త్వరలో జనసేన లేదా టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. గతంలో టీడీపీ నుంచి కైకలూరు ఎమ్మెల్యేగా పని చేశారు వెంకట రమణ.