జగన్ మీద విమర్శలు.. .. మోడీ షాక్ ఇచ్చారా...!?
ఏపీకి వచ్చిన మోడీ ఎన్డీయే మిత్రుల తొలి సభలో బిగ్ సౌండ్ చేస్తారు అని అనుకున్నారు.
ఏపీకి వచ్చిన మోడీ ఎన్డీయే మిత్రుల తొలి సభలో బిగ్ సౌండ్ చేస్తారు అని అనుకున్నారు. కానీ మోడీ జాతీయ అంశాలను ఎన్డీయే గెలుపు గురించి ఎక్కువగా మాట్లాడారు. చివరిలో మాత్రం జగన్ ప్రభుత్వం మీద ఒకటి రెండు విమర్శలతో సరిపెట్టారు. అవి కూడా జనరలైజ్ చేస్తూనే మాట్లాడారు.
నిజానికి గతంలో అంటే 2019 ఎన్నికల వేళ మోడీ చంద్రబాబు మీద వీర లెవెల్ లో విమర్శలు చేశారు. పోలవరం ని ఏటీఎం కింద వాడుకున్నారు అంటూ ఘాటైన పదజాలం ఉపయోగించారు. కానీ జగన్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని మోడీ అన్నారు ఒకరిని మించి ఒకరు దోచుకుంటున్నారు అని సాధారణ విమర్శలే చేశారు.
ఇక మోడీ ఎక్కువగా కాంగ్రెస్ ని విమర్శించారు. ఇండియా కూటమి అన్నారు. ఏపీలో ఇండియా కూటమి అయితే లేనట్లే. కాంగ్రెస్ ఏపీకి జగన్ చెల్లెలు షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ వైసీపీ వేరు వేరు కాదు అంటూ ప్రధాని కొత్త ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలను ఒకే కుటుంబం నడిపిస్తోంది అని వైఎస్సార్ ఫ్యామిలీ అది అని చెప్పుకొచ్చారు.
ఇదే సభలో పవన్ చంద్రబాబు ఇద్దరూ చెల్లెళ్ళను సైతం మోసం చేసిన వారు జగన్ అని అంటే నరేంద్ర మోడీ మాత్రం జగన్ షర్మిల ఒక్కటే అని చెప్పడం ఒక రకంగా చిత్రమైన ఆరోపణగానే అంతా చూస్తున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో అభివృద్ధి లేదని మోడీ విమర్శలు చేశారు.
అలా ఏపీ విషయంలో అంతటితోనే సరిపెట్టారు. అంతే తప్ప గంజాయి రాజ్యమనో లేక మరో రకంగా ఏపీ సర్వనాశనం అయిందనో ఏమీ ఆరోపణలు చేయలేదు. ఇదే రకమైన ఆరోపణలను పవన్ కళ్యాణ్ చేశారు. ఏపీలో జగన్ రావణాసురుడుగా ఉన్నారని అన్నారు. జగన్ ఏపీని పూర్తిగా భ్రష్టు పట్టించారు అని చంద్రబాబు అన్నారు.
కానీ మోడీ మాత్రం ఆ ఊసే చెప్పలేదు. ఆయన ఎంతసేపూ నాలుగు వందల సీట్లు ఎన్డీయేకు రావాలి ఎన్డీయే మూడవసారి గెలవాలి అనే చెప్పుకొచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరారు. ఏపీలో కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి రావాలని మాత్రం ప్రధాని కోరుకున్నారు.
ఇక మిగిలినది అంతా ఆయన కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ళలో దేశానికి చేసిన మేలు అంతా చెప్పారు. ఎంటీయార్ గురించి ఆయన తలచుకున్నారు. ఎన్టీయార్ రాముడి పాత్రలో జీవించారు అని ప్రశంసించారు ఎన్టీయార్
పేదల కోసం రైతుల కోసం పాటుపడ్డారు అని కూడా అన్నారు.
ఎన్టీయార్ ఏపీ ప్రగతి కోసం కృషి చేశారు అని కీర్తించారు. అదే విధంగా పీవీ నరసింహారావు కోసం కూడా చెప్పుకొచ్చారు. పీవీకి భారతరత్న తాము ఇచ్చామని కూడా చెప్పారు. కాంగ్రెస్ పీవీని అవమానించిందని ప్రధాని చెప్పడం విశేషం. మొత్తం మీద ప్రధాని ప్రసంగంలో జగన్ మీద తీవ్ర విమర్శలు చేస్తారు అని ఆశించిన వారికి మాత్రం ఆయన స్పీచ్ కొంత చప్పగానే అనిపించింది అని అంటున్నారు.