తెలంగాణలో బీజేపీని ఖతం చేసే పనిలో బిజీ మోడీ!
బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టుకోవాల్సిన సమయంలో అవేవీ చేయకుండా పాతాళంలోకి పడిపోయే పనులు చేస్తోందని అంటున్నారు .
తెలంగాణలో ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతుంటే రాష్ట్రంలో బలపడాలని చూస్తున్న బీజేపీ మాత్రం దిమ్మతిరిగే ఎపిసోడ్లతో దిగజారిపోయే పనిలో బిజీగా ఉందని తాజా పరిణామాలను గమనించిన వారు కామెంట్ చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అనే సిగ్నల్స్ ని అధికార బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా పంపిస్తుండగా... 6 గ్యారంటీలను ప్రకటించి ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం తాను సిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెప్పింది. ఇక మరో ప్రధాన పార్టీ అయినా బీజేపీ తన వ్యూహాలకు పదును పెట్టుకోవాల్సిన సమయంలో అవేవీ చేయకుండా పాతాళంలోకి పడిపోయే పనులు చేస్తోందని అంటున్నారు ఈ పరిస్థితికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కారణమయ్యారని పలువురు విమర్శిస్తున్నారు.
తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి పూర్తి సానుకూలత లేదని, విజయం సులభమేమి కాదని అంచనాలు వెలువడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలు గట్టి పోటీ ఇస్తే పలు స్థానాల్లో పక్కాగా గెలవడం సులభమని అంచనాలు వెలువడుతున్న సమయంలో బీజేపీ తీరు అయోమయంగా ఉందని ఇటీవల జరిగిన పరిణామాలను నిశితంగా గమనించిన వారు అంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను హఠాత్తుగా ఆ పదవిలో నుంచి ఊడబీకడం, తాజాగా పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలను ఈ మేరకు ఉదాహరిస్తున్నారు.
దాదాపు 10 ఏళ్ల క్రితం జరిగిన రాష్ట్ర విభజనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటు వేదికగా మరోమారు ప్రస్తావిస్తూ ఉమ్మడి రాష్ట్రాన్ని తెలంగాణ- ఏపీగా విడదీసిన తీరు సరిగా లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలు ఆవేదనతో విడిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా ఈ పాయింట్ ఆధారంగా ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందివచ్చే అవకాశాన్ని వదిలిపెట్టెందుకు సిద్ధంగా లేని బీఆర్ఎస్ పార్టీ... ప్రధాని మోడీ చేసిన ఈ కామెంట్లను పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్దోంది. రాష్ట్రం ఏర్పడి దాదాపు 10 ఏళ్లు అయిపోతుండటం, అభివృద్ధిలో తెలంగాణ ముందుకు సాగుతున్న విషయం కళ్ల ముందు ఉన్నప్పటికి ప్రధాని హోదాలో ఉన్న బీజేపీ రథసారథి నరేంద్ర మోడీ ఈ రకమైన కామెంట్లు చేయడం ఏంటని ప్రస్తావిస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహాయం అందించాల్సింది పోయి అసలు రాష్ట్ర విభజనను తప్పు పట్టేలా మాట్లాడడం బీజేపీకి తెలంగాణ అంటే ఉన్న వ్యతిరేకతని చాటి చెప్తోందని విమర్శిస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్ష పదవిలో నుంచి తొలగించడం ద్వారా శ్రేణులను ఒకింత నిరాశలోకి నెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ జాతీయ నాయకత్వం తాజాగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం ఎన్నికల ముందు పెద్ద దెబ్బ అని అంతర్గత వేదికల్లో ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలోనే బలపడుతున్న బీజేపీని బలిపెట్టే విధంగా సొంత పార్టీ నేతల వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. ఢిల్లీ పెద్దలు తమ మొర ఆలకించాలని వేడుకుంటున్నారు.