సీటులోకి రాకముందే కాక... ట్రంప్ కు షాకిచ్చిన మెక్సికో ప్రెసిడెంట్!
అయితే.. ట్రంప్ కు ఆ దేశ ప్రెసిడెంట్ రివర్స్ లో షాకిచ్చారు.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న డొనాల్డ్ ట్రంప్.. ఆ కుర్చీ ఎక్కక ముందే చాలా దేశాలను టెన్షన్ పెడుతున్నారనే చర్చ బలంగా వినిపిస్తుంది. ప్రధానంగా అటు కెనడా, ఇటూ గ్రీన్ లాండ్, పనామా కాలువ లపై ఇప్పటికే సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా మెక్సికోపైనా స్పందించారు. అయితే.. ట్రంప్ కు ఆ దేశ ప్రెసిడెంట్ రివర్స్ లో షాకిచ్చారు.
అవును... మరికొద్ది రోజుల్లో అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డొనాల్డ్ ట్రంప్.. పక్క నున్న కెనడా, గ్రీన్ లాండ్, పనమా కాలువలను విలీనం చేసుకోవాలన్న కోరికను ఇప్పటికే పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఈ సందర్భంగా తాజాగా స్పందించిన ఆయన.. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా మారుస్తానని చెప్పుకొచ్చారు.
అయితే దాని కోసం... కెనడాపై సైనికశక్తి బదులు ఆర్థికశక్తితో ఒత్తిడి తెస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఇదే సమయంలో... అమెరికా జాతీయ భద్రతకు కెనడా విలీనం చాలా అవసరమని నొక్కి చెప్పారు. ఇక.. పనామా కాలువ, గ్రీన్ లాండ్ ల విషయానికొస్తే... సైనిక శక్తిని వినియోగించబోనని హామీ ఇవ్వలేనంటూ పరోక్షంగా బెదిరింపు మాటలు మట్లాడారు.
దీంతో... ట్రంప్ తీరును కెనడా, పనామా, గ్రీన్ లాండ్ లు తీవ్రంగా ఖండించాయి. మరోపక్క... గల్ఫ్ ఆఫ్ మెక్సికో ను "గల్ఫ్ ఆఫ్ అమెరికా" గా మారుస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విధంగా సీటు లోకి రాకముందే పొరుగు దేశాలతో కాలు దువ్వుతున్నారు. ఈ సమయంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఇందులో భాగంగా... మెక్సికోను "గల్ఫ్ ఆఫ్ అమెరికా" గా మారుస్తానంటున్నారు.. అమెరికాను తమెందుకు "మెక్సికన్ అమెరికా" అని పిలవకూడదంటూ చురకలంటించారు. ఈ సందర్భంగా 17వ శతాబ్ధం నాటి వరల్డ్ మ్యాప్ చూపించిన ఆమె.. నాడు ఉత్తర అమెరికాను "మెక్సికన్ అమెరికా" అని పేర్కొనేవారని గుర్తు చేశారు.
ఇదే సమయంలో ట్రంప్ పేరు ఎత్తకుండానే వాయించిన క్లాడియా... గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఐక్యరాజ్య సమితి గుర్తించిందనే విషయాన్ని మర్చిపోవద్దని.. యునైటెడ్ స్టేట్స్ ని మనమెందుకు "మెక్సికన్ అమెరికా" అని పిలవకూడదని ప్రశ్నించారు. పైగా ఇది వినడానికి చాలా బాగుంది కదా అని మెక్సికో అధ్యక్షురాలు వ్యాఖ్యానించారు.