పవన్, లోకేశ్ మధ్య గ్యాప్.. భూమన చెబుతోంది నిజమా?
ఏపీలో భావినేతలుగా ప్రచారంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్, టీడీపీ యువనేత లోకేశ్ పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.;
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీడీపీ యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా? వారిద్దరూ ఒకరితో ఒకరు విభేదిస్తున్నారా? అంటే అవును అని చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి. పవన్, లోకేశ్ సంబంధాలపై భూమన షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఆ ఇద్దరికి గ్యాప్ ఉండటం నిజమే అన్నదానికి కాశినాయన క్షేత్రంలో భవనాల తొలగింపే ప్రధానకారణమని భూమన చెబుతున్నారు. పవన్ శాఖలో తప్పిదం జరిగితే లోకేశ్ క్షమాపణ కోరడం వెనుక కారణం కూడా అదేనంటున్నారు భూమన.
ఏపీలో భావినేతలుగా ప్రచారంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్, టీడీపీ యువనేత లోకేశ్ పై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి మధ్య వైరుధ్యాలతో రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఎవరో చేసిన తప్పునకు మరెవరో క్షమాపణ కోరడాన్ని కూడా భూమన ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందిన కాశినాయన క్షేత్రంలో కూల్చివేతల వెనుక ఉన్న దుష్టశక్తులు ఎవరో బయట పెట్టాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ మధ్య వైరుధ్యంతో ఆధ్యాత్మిక క్షేత్రాలు నలిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కాశీనాయన క్షేత్రంలో కూల్చివేతలు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మం గుండెలను బుల్డోజరులతో బద్దలుకొట్టడమేనని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు ఈ కూల్చివేతలపై ఎక్కడా స్పందించలేదని భూమన ఆరోపించారు. పాశవికంగా, దుర్మార్గంగా జరిగిన ఈ దాడిపై ఆయన నుంచి ఒక్క ప్రకటన రాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ కూల్చివేతలకు పాల్పడిన అటవీశాఖ పవన్ కల్యాణ్ పరిధిలో ఉందని గుర్తు చేశారు. సనాతన ధర్మ పరిక్షకుడిగా తనకు తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం, తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. సనాతన ధర్మంపై దాడి చేస్తే తలలు తీస్తానంటూ భీకర ప్రకటనలు చేసే పవనానందుల గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయిందని భూమన ప్రశ్నించారు.
గతంలో తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు ఆరుగురు చనిపోతే నేరుగా ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పిన పవన్, ఈ రోజు కాశీనాయన క్షేత్రం పరిశీలనకు ఎందుకు రాలేదని నిలదీశారు. తన శాఖలోని అధికారులు తప్పు చేసినా, పవన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కు బదులుగా మంత్రి లోకేశ్ క్షమాపణ చెప్పడం, ఆయన సొంత డబ్బుతో కూల్చివేసిన భవనాలను తిరిగి నిర్మిస్తానని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని భూమన అడగడంపై చర్చ జరుగుతోంది.