షర్మిల కూడా ఫైర్.. అసలేం జరిగింది?
పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగం రాజకీయ దుమారాన్ని రేపుతోంది.;
పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కూటమిలో ప్రధాన పార్టీ లోలోన రగిలిపోతుండగా, మిగిలిన విపక్షాలు బహిరంగంగానే తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 40 ఏళ్ల టీడీపీని తానే నిలబెట్టానని జనసేనాని చెప్పుకోవడాన్ని టీడీపీ కార్యకర్తలు తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ నేత అంబటి రాంబాబు అయితే యథావిధిగా పవన్ పై విమర్శల దాడి చేశారు. ఇప్పుడు ఎన్నడూ లేనట్లు సీపీఐ, కాంగ్రెస్ సైతం పవన్ వ్యాఖ్యలపై కన్నెర్ర జేస్తున్నాయి. త్రిభాషా విధానంపై పవన్ వ్యాఖ్యలను సీపీఐ కార్యదర్శి కార్యదర్శి రామక్రిష్ణ తప్పుబట్టడమే కాకుండా, పవన్ కు హాస్యనటుడు బ్రహ్మానందంతో క్లాసు ఇప్పించాలని సూచించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా జనసేనాని పవన్ పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు.
జనసేన అధ్యక్షుడిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బీజేపీ మైకులో మాట్లాడుతున్నారని పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. జనసేన సిద్ధాంతాలు ఏంటని ప్రశ్నించడమే కాకుండా, ఆ పార్టీ ఆవిర్భావానికి కారణమైన అంశాలను ఇప్పుడు వదిలేస్తున్నారని ఆరోపించారు. చే గువేరా, గద్దర్ సిద్ధాంతాలను పాటిస్తానని చెప్పుకునే పవన్ ఇప్పుడు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా మార్గంలో నడుస్తున్నారని వ్యాఖ్యానించారు. సనాతనం అంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారని మండిపడ్డారు.
జనసేన పార్టీని ఆంధ్రా మతసేన పార్టీగా మార్చారన్న షర్మిల.. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మత అజెండాగా మార్చడం దారుణమని కామెంట్ చేశారు. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఏపీలో విభజించు, పాలించు అన్నట్లుగా ఆయన వైఖరి ఉండటం విచారకరమని పేర్కొన్నారు.