డీకే అరుణ‌కు 'దొంగ' దెబ్బ‌.. కాఫీ తాగి వెళ్లాడా?!

ఫైర్ బ్రాండ్ పొలిటీషియ‌న్.. బీజేపీ నాయ‌కురాలు, ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ దొంగ హ‌ల్చ‌ల్ చేయ‌డం రాష్ట్రంలోనే సంచ‌ల‌నం సృష్టించింది.;

Update: 2025-03-16 19:16 GMT

ఫైర్ బ్రాండ్ పొలిటీషియ‌న్.. బీజేపీ నాయ‌కురాలు, ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఓ దొంగ హ‌ల్చ‌ల్ చేయ‌డం రాష్ట్రంలోనే సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. ఇది జ‌రిగిన చాలా గంట‌ల వ‌ర‌కు ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ నాయ‌కురాలిగా ఉన్న డీకే అరుణ‌.. ఇంటిపై గ‌తంలోనే దాడి జ‌రిగింది. తాజాగా ఆమె పార్టీ స‌మావేశం మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌కు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవ‌రూ లేరు. వాచ్‌మ‌న్ మాత్ర‌మే ఉన్నారు. ఇదిలావుంటే.. ఓ దుండ‌గుడు.. ముఖానికి, చేతుల‌కు మాస్కులు ధ‌రించి.. జూబ్లీహిల్స్ , రోడ్ నెంబ‌రు 56లో ఉంటున్న డీకే అరుణ నివాసానికి దొడ్డిదారిలో ప్ర‌వేశించాడు.

నేరుగా.. నడుచుకుంటూ.. వంట గ‌దిలోకి వెళ్లాడు. అక్క‌డే చాలా సేపు ఉన్నాడు. ఈ స‌మ‌యంలో కాఫీ క‌లుపుకొని తాగిన‌ట్టు తెలుస్తోంద‌ని డీకే అరుణ కారు డ్రైవ‌ర్ పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సీసీ టీవీ కెమెరాలో దుండ‌గుడు ఇంట్లోకి ప్ర‌వేశించ‌డం.. నేరుగా వంట‌గ‌దిలోకి వెళ్ల‌డం.. అక్క‌డే గంట‌న్న‌ర‌కు పైగా ఉండ‌డం వంటివి న‌మోదైన‌ట్టు ఆయ‌న వివ‌రించాడు. అయితే.. ఇంట్లో ఎలాంటి వ‌స్తువులు పోలేద‌ని.. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో మేడం ఇంట్లో లేర‌ని చాలా స‌మ‌యం త‌ర్వాత‌.. తాను గుర్తించిన‌ట్టు తెలిపారు. డీకే అరుణ బెడ్ రూమ్ వ‌ర‌కు కూడా ఆగంత‌కుడు వెళ్లిన‌ట్టు చెప్పారు.

దీనిపై డీకే అరుణ స్పందించారు. త‌న ఇంట్లోకి దొంగ‌లు ప్ర‌వేశించిన వ్య‌వ‌హారం ఆల‌స్యంగా తెలిసింద‌ని, ఒక్క‌డే వ‌చ్చిన‌ట్టు ఆధా రాలు కూడా ఉన్నాయ‌ని త‌న డ్రైవ‌ర్ చెప్పిన‌ట్టు ఆమె తెలిపారు. ఈ విష‌యంపై పోలీసు క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశామ‌న్నారు. త‌మ ఇంటిపై గ‌తంలోనూ దాడి జ‌రిగిన నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మత్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని గ‌తంలోనే తాను ఫిర్యాదు చేసిన‌ట్టు వివ‌రించారు. అయితే..అప్ప‌ట్లో పోలీసులు లైట్ తీసుకున్నార‌ని తెలిపారు. ఇప్పుడైనా.. త‌న ఇంటికి, కుటుంబానికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని డీకే అరుణ పోలీసుల‌ను వేడుకున్నారు.

ఎలా వ‌చ్చాడు?

డీకే అరుణ నివాసం.. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబ‌రు 56లో ఉంటుంది. ఇది ఒక ర‌కంగా శ‌తృ దుర్భేధ్యం. ఇంటి చుట్టూ విద్యుత్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక‌, కాప‌లాగా.. వాచ్‌మెన్‌.. ఎవ‌రైనా గేటుపై చేయి వేస్తే.. మోగేలా హార‌న్.. వంటి అత్యాధుని వ్య‌వ‌స్థ‌ల‌తోకూడిన ర‌క్ష‌ణ‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఆగంత‌కుడు ఎలా ప్ర‌వేశించాడ‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. చేతుల‌కు గ్లౌజులు, ముఖానికి మాస్క్ ధ‌రించి ఉన్న‌ట్టుగా సీసీ టీవీల్లో క‌నిపిస్తోంది. అదేవిధంగా 35-40 ఏళ్ల మ‌ధ్య ఉన్న వ్య‌క్తిగా కూడా క‌నిపిస్తున్నాడు. అయితే.. ఇది గ‌తంలో ఇంట్లో పనిచేసిన వారి ప‌నే అయి ఉంటుంద‌న్న సందేహాలు కూడా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News