బీసీలకు చాన్స్... జనసేన డెసిషన్ కీలకం !
జనసేనకు ఇప్పటిదాకా రెండు ఎమ్మెల్సీలు దక్కాయి. అయితే వాటిని ఆ పార్టీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చింది అన్న విమర్శలు ఉన్నాయి.;
జనసేన 11 ఏళ్ళు పూర్తి చేసుకుని 12వ ఏట అడుగుపెట్టింది. ఒక రాజకీయ పార్టీగా కొన్ని విజయాలను సాధించింది. ఇంకా లక్ష్యాలు చాలా ఉన్నాయి. వాటి కోసం సదూరమైన ప్రయాణం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన తన రాజకీయ సామాజిక సైద్ధాంతిక భూమికను మరింతగా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
జనసేనకు ఇప్పటిదాకా రెండు ఎమ్మెల్సీలు దక్కాయి. అయితే వాటిని ఆ పార్టీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చింది అన్న విమర్శలు ఉన్నాయి. దానికి జనసేన అధినాయకత్వం చెప్పే కారణాలు బాగానే ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు అని ఈ విషయంలో సామాజిక అంశాలను తాము పట్టించుకోమని ఆ పార్టీ అధినాయకత్వం అంటోంది. అది మంచిదే కానీ ఇతర విషయాలు కూడా ఆలోచించాల్సి ఉంటుంది అని అంటున్నారు.
అయితే పార్టీలో అవకాశాలు వచ్చినపుడు అలా అందరికీ పంచడం కూడా ఒక విధానంగా తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు. ఇదిలా ఉంటే జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కాయి. అందులో రెండు కాపులకు ఒకటి కమ్మ సామాజిక వర్గానికి దక్కింది. నాలుగవ మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. అది నాగబాబుకు అని ప్రచారంలో ఉంది.
అయితే ఇక్కడే జనసేన పార్టీ సుదీర్ఘమైన భవిష్యత్తు కోసం కీలకమైన ఆలోచన చేయాలని అంటున్నారు. జనసేన ఈ కేబినెట్ బెర్త్ కనుక బీసీలకు ఇస్తే బాగుంటుంది అన్న సూచనలు అయితే రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. ఆ పార్టీలో బీసీ ఎమ్మెల్యేలు బాగానే ఉన్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విశేష అనుభవం కలిగిన నాయకుడిగా జనసేనలో ఉన్నారు. ఆయనకు దాదాపుగా నాలుగు దశాబ్దాలు రాజకీయ అనుభవం ఉంది.
బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన సమర్థుడు, వివాదరహితుడు అన్న పేరు ఉంది. ఆయనకు చాన్స్ ఇస్త్గే అది జనసేనకు మరింతగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. పైగా టీడీపీ ఈ సామాజిక వర్గం నుంచి ఎవరికీ మంత్రిగా చాన్స్ ఇవ్వలేదు 2009 తరువాత గవర సామాజిక వర్గం నుంచి మంత్రి అయిన వారు లేరు.
దాంతో జనసేన ఈ చాన్స్ తీసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో మరింతగా సామాజిక బలం పెరిగి ఆ పార్టీ విస్తృతికి అది ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ఇక నరసాపురం నుంచి గెలిచిన బొమ్మిడి నాయకర్ కి మంత్రి పదవి ఇచ్చినా బాగానే ఉంటుంది అని అంటున్నారు. ఆయన కూడా బీసీలలో బలమైన నాయకుడిగా ముద్రపడి ఉన్నారు. ఈ ఇద్దరు కాకపోయినా బీసీలలో మరో పేరుని తీసుకున్నా బాగానే ఉంటుందని చెబుతున్నారు.
జనసేనకు మంత్రి పదవి అంటే ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే కీలకం అవుతుంది అని అంటున్నారు. అయితే నాగబాబుకు మంత్రి పదవి అని పార్టీ ఇప్పటికే డిసైడ్ అయితే కనుక ఫ్యూచర్ లో అయినా బీసీలకు అవకాశాలు కల్పిస్తే బాగుంటుందని కూడా సూచనలు వస్తున్నాయి.
అలా కనుక చేయకపోతే రాజకీయ ప్రత్యర్ధులు జనసేనను ఒక సామాజిక వర్గానికి చెందిన పార్టీగా కుటుంబ పార్టీగా ముద్రవేసే ప్రమాదం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలను ఎవరు పెట్టినా అవి ప్రజల కోసం, ప్రజా కోణంలోనే పనిచేస్తాయన్నది వాస్తవం అంటున్నారు. సో ఆ విధంగానే జనసేన నిర్ణయాలు ఉంటే ఆ పార్టీ సుదీర్ఘ భవిష్యత్తుకు అది ఉపయోగకరమని అంటున్నారు.