ఎర్ర మేధావులకు పవన్ కన్నెర్ర అవుతున్నారా ?

పవన్ కళ్యాణ్ బోల్డ్ గా మాట్లాడుతారు. ఆయన మనసులో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది.;

Update: 2025-03-16 19:30 GMT

పవన్ కళ్యాణ్ బోల్డ్ గా మాట్లాడుతారు. ఆయన మనసులో ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. అందువల్లనే ఆయనను నిలకడ లేని రాజకీయం అని భావించవచ్చు. అలాగని పవన్ ఒక ఫిలాసఫీకి కట్టుబడిన నేతగా చూడాలని అనుకుంటే అది కూడా అవతల వారి తప్పు అవుతుంది. ఆయన ఇష్యూ బేస్డ్ గా మాట్లాడుతున్నారు అని అంటారు.

తప్పు ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడుతారు అని చెబుతారు. మరో వైపు చూస్తే ఆయనలో లెఫ్ట్ భావజాలం పట్ల గౌరవం ఉందని అదే సమయంలో హిందూత్వ మీద కూడా మర్యాద ఉందని అంటారు. ఇలా ఉండకూడదా అంటే ఉండవచ్చు. నిజానికి ఏ ఫిలాసఫీ కూడా నూరు శాతం కరెక్ట్ కాదు. కానీ ఆ భావజాలానికి ఆకర్షితులై అందులోనే మునిగి తేలిన వారు అంతా మంచే అక్కడ ఉందని నమ్ముతూంటారు.

పవన్ మాత్రం ఇష్యూ మీదనే మాట్లాడినపుడు కొన్ని అంశాలలో తేడా వస్తే దానిని పట్టుకుని ఆయన రెట్టిస్తారని అదే కొందరికి ఇబ్బంది అవుతోందని అంటారు ఇక ఈ దేశంలో లెఫ్ట్ భావజాలానికి మీడియా మద్దతు ఎక్కువగా ఉంటుంది. మేధావులు ఎక్కువ మంది ఆ భావజాలాన్ని ప్రవచిస్తూంటారు. హిందూత్వ అన్నది కొందరి దృష్టిలో ఒక మతంగా ఉంటుంది. అయితే హిందుత్వం అన్నది మతం కాదని జీవన విధానమని చెప్పేవారు ఉన్నారు కానీ అది జనంలోకి పెద్దగా వెళ్ళడం లేదు.

ఇక పవన్ తిరుపతి లడ్డూల విషయంలో కల్తీ జరిగింది అన్నపుడు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అన్న డిమాండ్ ని ముందుకు తెచ్చారు. అంతకు ముందు ఆయన ఆ మాట వాడలేదు. ప్రపంచ దేవుడు ఆలయంలో కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పటికీ దాని మీద స్పందించకుండా ఉండడం సబబు కాదని ఆయన అనుకోని ఉండవచ్చు. అంతే కాదు దానికి తాత్కాలిక ఊరట కంటే శాశ్వతమైన పరిష్కారం ఉండాలని భావించే ఆయన సనాతన బోర్డు అని డిమాండ్ చేసి ఉండవచ్చు.

ఇక దానిని ముందు పెట్టి ఆయన మీద లెఫ్టిస్టు భావజాలం కలిగిన వారు అంతా విరుచుకుపడుతున్నారు. అయితే పవన్ ఇతర మతాల గురించి ఏమీ అనలేదు. హిందువుల విషయంలో అన్యాయం జరిగితే మాట్లాడరా అని మాత్రమే అన్నారు. మరో విషయంలో తీసుకుంటే మహా కుంభ మేళాను మృత్యు కుంభమేళాతో పోల్చడం మీద ఆయన ఆవేశానికి గురి అయ్యారు ఆ మాట అన్నది మమతా బెనర్జీ.

ఆయన ఆమెను ఉద్దేశించి విమర్శలు పరోక్షంగా చేశారు ఇదే మాటలను ఇతర మతాల విషయంలో అనగలరా అని నిలదీశారు. త్రిభాషా సూత్రం విషయంలో తన అభిప్రాయం ఏంటో ఆయన లేటెస్ట్ గా ట్వీట్ ద్వారా చెప్పారు. ఇలా పవన్ తాను చెప్పిన అంశాల మీద స్పష్టంగానే ఉన్నారు. అయితే ఎర్ర మేధావులకు మాత్రం కాషాయం పార్టీ మీద మొదటి నుంచి వైరం ఉంది. అది సిద్ధాంత బద్ధమైనది.

అందువల్ల వారు బీజేపీతో మిత్రుడిగా ఉన్నారు కాబట్టి పవన్ ని సనాతనీ అంటూ విమర్శలు చేస్తున్నారు. ఒక విధంగా పవన్ గట్టిగా వీటి మీద మాట్లాడడం వల్ల ప్రజలలోకి వెళ్తున్నాయి. దానితో కూడా ఆయనను కట్టడి చేయడానికి చూస్తున్నారు భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉంటారు కాబట్టి వారి గురించి కాకుండా మైనారిటీల గురించి మాట్లాడాలని అదే సెక్యూలరిజం అని మేధావులు అంటున్నారు.

కానీ మెజారిటీ ప్రజల హక్కులకు భంగం కలిగినపుడు కూడా మాట్లాడాలని అదే అసలైన సెక్యులరిజం అని మరచిపోతున్నారు అని మరో వైపు వాదనగా ఉంది. ఎక్కడ ఇబ్బంది అయితే దాని మీద మాట్లాడితే సమానత్వంగా ఉంటుంది, సర్వ మతాలకు న్యాయంగా ఉంటుంది కానీ మెజారిటీ కాబట్టి వారిని పట్టించుకోకూడదు అంటే అది రియల్ సెక్యూలరిజం అవుతుందా అన్నది కూడా ఈ తరహా మేధావులు ఆలోచించాలి కదా అంటున్నారు.

ఇక పవన్ విషయానికి వస్తే ఆయన రాజకీయ నేత. తన భావాలను మార్చుకునే స్వేచ్చ ఆయనకు ఉంది. ఆయన విషయంలో న్యాయం ఉంటే జనాలు ఆదరిస్తారు. కానీ పట్టుబట్టి ఆయన ఫలానా విషయాలనే మాట్లాడాలని ఫలానాది మాట్లాడరాదు అని చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుందా అన్నది మరో ప్రశ్న.

పవన్ చేగువేరా అని అన్నప్పుడు చప్పట్లు కొట్టిన వారు హిందూత్వ అంటే ఎందుకు విమర్శిస్తున్నారో కూడా చెప్పాలి కదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఎవరైనా భారతదేశం మూలాలను ఇక్కడ ఆత్మను అర్ధం చేసుకుని రాజకీయం అయినా ఏదైనా చేస్తే బాగుంటుంది అని అంటున్నారు. ఈ దేశం ఆత్మను పట్టుకోకుండా తమ ఫిలాసఫీయే గ్రేట్ అని చెప్పుకునే వారికి పవన్ మాత్రమే కాదు ఎవరైనా కన్నెర్ర అవుతారని విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News