వారసులకు లైన్ క్లియర్ చేస్తున్న కూటమి ఎమ్మెల్యేలు ?

వారసత్వం అన్నది రాజకీయాల్లో చాలా కీలకంగా ఉందిపుడు. ఏ రంగంలో లేని వారసత్వం రాజకీయాల్లో యమ జోరుగా సాగుతోంది.;

Update: 2025-03-17 03:00 GMT

వారసత్వం అన్నది రాజకీయాల్లో చాలా కీలకంగా ఉందిపుడు. ఏ రంగంలో లేని వారసత్వం రాజకీయాల్లో యమ జోరుగా సాగుతోంది. ఈ విషయంలో సందేహం అయితే ఎవరికీ లేదు. దాదాపు రెండు లక్షల మందికి ఎమ్మెల్యేగా ప్రజా ప్రతినిధిగా ఉండడం అంటే దాని వెనక ఎంతో కృషి ఉంటుంది. దశాబ్దాల తపన ఉంటుంది.

అలా వచ్చిన పదవిని తమ కుటుంబానికి పది కాలాల పాటు సాగాలని కోరుకోవడంలో తప్పేమీ లేదన్న భావన ఉంది. పైగా ఆ కుటుంబంలోని వారికే అన్ని విషయాల మీద అవగాహన ఉంటుందని పట్టు ఉంటుందని అధినాయకులూ నమ్మి టికెట్ ఇస్తూంటారు. ఈ విధంగా చూస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే చందంగా తాము పవర్ లో ఉండగానే బిడ్డలకు కూడా రాజకీయం మప్పి వారిని కూడా భావి లీడర్లుగా తయారు చేసే విధానం అయితే పెరుగుతోంది.

ఇక విశాఖ జిల్లాలో చూస్తే నాలుగు అసెంబ్లీ సీట్లలో వారసుల హవా జోరుగా సాగుతోంది. దాని వెనక ఎమ్మెల్యేలు అయిన తండ్రుల మద్దతు కూడా దండీగా ఉంటోంది అని అంటున్నారు. టీడీపీ బీజేపీ ఎమ్మెల్యేలు ఇలా తెలివిగా ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

విశాఖలో బిగ్ షాట్ గా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా తన వారసుడిగా కుమారుడు గంటా రవితేజాను తెర మీదకు తెస్తున్నారు. ఆయన తండ్రి గెలిచిన భీమిలీలో తానే ఎమ్మెల్యే అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు అని అంటున్నారు.

ఆయన అధికారిక సమీక్షలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు. అలాగే ఆయనే అన్ని విషయాలు చూసుకుంటున్నారు అని అంటున్నారు. 2029 నాటికి ఇప్పటి నుంచే దగ్గరుండి గంటా ప్రిపరేషన్ కుమారుడికి ఇలా ఇప్పిస్తున్నారని అంటున్నారు. ఈయన తరువాత విశాఖ తూర్పు నుంచి చూస్తే వెలగపూడి రామక్రిష్ణ బాబు ఉన్నారు. ఆయన నాలుగు సార్లు వరసగా ఎమ్మెల్యేగా గెలిచి తన పట్టుని నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు ఏడు పదుల వయసు వస్తుంది. దాంతో ఆయన తన కుమారుడిని ఇప్పటి నుంచే రంగంలోకి దించుతున్నారు.

ఆయన కుమారుడు ప్రతాప్ పొలిటికల్ గా తన యాక్టివిటీని బాగా పెంచేసారు అని అంటున్నారు. ఆయన రాజకీయంగా కూడా తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీలోని అందరితో బాగా ఉంటున్నారు. ఇక ఫ్లెక్సీల మీద తండ్రితో పాటే ఆయన ఫోటో కూడా కచ్చితంగా ఉంటోంది. అలా జనాలకు ఇప్పటి నుంచే ఆయన పరిచయం అవుతున్నారని అంటున్నారు.

విశాఖ పశ్చిమ నియోజకవర్గం సీనియర్ ఎమ్మెల్యే గణబాబు కుమారుడు మౌర్య కూడా తండ్రి బాటలో నడుస్తూ పార్టీలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయనే చాలా పనులు చక్కబెడుతున్నారు. క్యాడర్ తో మమేకం అవుతున్నారు. ఆయన అధికారులతోనూ మాట్లాడుతున్నారు. ఇలా తన వారసత్వాన్ని బలంగా చాటుకుంటున్నారు అని అంటున్నారు.

ఇక విశాఖ ఉత్తర నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు రెండు సార్లు గెలిచారు. ఆయన తన వారసురాలిగా కుమార్తె శ్యామలా దీపికను రంగంలోకి దించుతున్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఆమెను పరిచయం కూడా చేశారు. ఆమె నియోజకవర్గంలో తిరుగుతూ తానే ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు అని కూటమి నేతలే గుసగుసలు పోతున్నారు అని అంటున్నారు.

ఆమె శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇవన్నీ చూసిన వారు 2029 నాటికి వీరికే టికెట్లు అని అంటున్నారు. ఇక ఆశావహులు అయితే ప్రయత్నాలు మానుకోవాల్సిందే అని కూటమిలో అనుకుంటున్న నేపథ్యం ఉంది. మరి పార్టీ అధినాయకత్వాలు వీరిని ప్రోత్సహిస్తాయా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News