పవన్ కు దక్షిణాది బాధ్యతలు.. బీజేపీ భారీ స్కెచ్?
ఇందుకోసం తమ నమ్మకమైన మిత్రుడు పవన్ కల్యాణ్ ను వాడుకోవాలని చూస్తోందని ఢిల్లీ వర్గాల సమాచారం.;
బీజేపీ ఆపరేషన్ సౌత్ ముమ్మురం చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేని బీజేపీ.. ఆయా రాష్ట్రాలపై పట్టుబిగించేందుకు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సివస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే బీజేపీ భాగస్వామ్యంతో ప్రభుత్వం కొనసాగుతోంది. గతంలో కర్ణాటకలో ఆ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చినా, అక్కడ లింగాయత్ నాయకుడు యడియూరప్ప ప్రభావమే ఎక్కువ అంటుంటారు. ఇప్పుడు ఆయన వయోభారంతో సతమతమవుతుండటంతో దక్షిణాదిలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం ఒక్కటీ లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దక్షిణాదిలో విస్తరించాలని బలంగా కోరుకుంటోంది. ఇందుకోసం తమ నమ్మకమైన మిత్రుడు పవన్ కల్యాణ్ ను వాడుకోవాలని చూస్తోందని ఢిల్లీ వర్గాల సమాచారం.
ఏపీలో కూటమి ఏర్పడటానికి, తద్వారా కేంద్రంలో అధికారం నిలబడటానికి కీలకమైన పవన్ కు మరింత కీలక బాధ్యతలు అప్పగించాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తమ అజెండాను పవన్ కూడా ఆమోదించడంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన నుంచి పవన్ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ కంకణం కట్టుకున్నారు. దక్షిణాది ఆలయాల సందర్శనతోపాటు ఇటీవల వివాదంగా మారుతున్న హిందీ భాషా విధానంపైనా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యతిరేకిస్తున్న హిందీని పవన్ వెనకేసుకురావడమే కాకుండా స్టాలిన్ తో నేరుగా ఢీకొనడానికి సై అనే సంకేతాలు పంపారు. హిందీ ప్రభావం, ఉత్తరాది నేతల పెద్దరికాన్ని వ్యతిరేకించి తమిళులు పవన్ ను వ్యతిరేకించకపోవచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.
దక్షిణాదికి చెందిన పవన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక తన సమర్థతను నిరూపించుకుంటున్నారు. పాలనలో పట్టు సంపాదించడమే కాకుండా, జనసేన పార్టీని ఓ ప్రణాళిక ప్రకారం విస్తరిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణలోనూ తన ప్రభావం ఉందని చాటిచెప్పేలా అడుగులు వేస్తున్నారు. ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో తెలంగాణ జనసేన పుట్టినిల్లు అంటూ ఆయన వ్యాఖ్యానించడం వ్యూహాత్మకమే అంటున్నారు. బీజేపీ పెద్దల సూచనలతో ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ ప్రభావం చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సినీ అగ్ర కథానాయుకుడిగా పవన్ కు మంచి స్టార్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు పొలిటికల్ గా కూడా ఆయనకు మంచి ఆదరణే కనిపిస్తోంది. దీంతో తమ టార్గెట్ చేరుకోడానికి పవన్ అయితేనే బెటర్ అనే ఆలోచన బీజేపీలో మొదలైందని అంటున్నారు. దక్షిణాదిలో బీజేపీకి పెద్ద లీడర్లు ఉన్నా, వారు అంతా వారి సొంత రాష్ట్రాలకే పరిమితం అవుతున్నారు. పవనులా వారికి స్టార్ ఇమేజ్ లేకపోవడంతో ‘ఆపరేషన్ సౌత్’ కోసం పవన్ కు కీలక బాధ్యతలు అప్పగించాలని కమల దళం దాదాపు డిసైడ్ అయిందని చెబుతున్నారు.