పిల్లలు అండీ.. షమీ కూతురైతే హోలీ ఆడకూడదా?
అందరు పిల్లలతో పాటు కలిసి ఆటపాటలు ఆడుకుంటారు.. పాపం ఇలానే ఆడుకుంది టీమిండియా క్రికెటర్ షమీ కూతురు.;
చిన్నప్పుడు పిల్లలు వారికి నచ్చినది చేస్తారు.. నవ్వుతారు.. గెంతుతారు.. తమకు నచ్చినట్టు పనులు చేస్తారు. వారి అల్లరిని ఎంజాయ్ చేయడం తప్ప ఎవరూ అడ్డు చెప్పరు. ఎందుకంటే లోక జ్ఞానం తెలియని ఆ పసి మనసుల్లో విష బీజాలు, అడ్డుగోడలు, చాంధసవాదాలు ఏవీ ఉండవు. గల్లీలో ఎవరు ఏం చేస్తే వారితో కలిసి పనులు చేస్తారు. అయితే ఇది మనం చేయవద్దు.. ఇది చేయాలన్న సృహ వారికి ఉండదు. అందరు పిల్లలతో పాటు కలిసి ఆటపాటలు ఆడుకుంటారు.. పాపం ఇలానే ఆడుకుంది టీమిండియా క్రికెటర్ షమీ కూతురు. అదే ఇప్పుడు వారి మత పెద్దలకు ఆగ్రహం తెప్పించింది.
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ కుమార్తె ఐరా హోలీ రంగుల్లో కనిపించడం వివాదాస్పదంగా మారింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ అసద్ రజా ఖాన్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. షరియా చట్టాలకు విరుద్ధమైన పనులను పిల్లలు చేయడాన్ని షమీ, అతని కుటుంబ సభ్యులు అనుమతించకూడదని ఆయన సూచించారు.
హోలీ హిందువుల పండుగ అని, ముస్లింలు దానిని జరుపుకోవడం సరికాదని రజ్వీ అన్నారు. షరియా గురించి తెలిసిన వారు హోలీ వేడుకల్లో పాల్గొనడం నేరమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల షమీ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండకపోవడంపై కూడా రజ్వీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
షమీ కుమార్తె హోలీ రంగులతో ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వివాదం మొదలైంది. కొందరు ఈ విషయాన్ని సమర్థిస్తూ షమీ వ్యక్తిగత విషయం అని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం వ్యతిరేకంగా వాదిస్తున్నారు.
ఈ సంఘటన మరోసారి మతపరమైన ఆచారాలు, వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశాలపై చర్చకు దారితీసింది. ఒకవైపు మత పెద్దలు తమ నియమాలను అనుసరించాలని సూచిస్తుండగా, మరోవైపు ప్రజలు తమకు నచ్చిన విధంగా జీవించే హక్కును కోరుకుంటున్నారు. ఈ వివాదం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజయం సాధించిన సందర్భంగా షాబుద్ధీన్ రజ్వీ తన హర్షం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లందరికీ, ముఖ్యంగా మహ్మద్ షమీకి ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు షాబుద్ధీన్ రజ్వీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.