ఆ ఒక్క మ్యాచ్ కోసం రిటైర్మెంట్ వెనక్కు... కొహ్లీ ఇంట్రస్టింగ్ కామెంట్స్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 36 ఏళ్ల వయసులో ఉన్న కొహ్లీని వరల్డ్ ఫిట్టెస్ట్ క్రికెటర్ అని కూడా అంటారు!;

Update: 2025-03-15 19:41 GMT

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు! ప్రధానంగా రన్స్ మెషిన్ గా పేరు సంపాదించుకున్న కొహ్లీని ‘ఛేజింగ్ కింగ్’ అని కూడా అంటారు. అయితే.. కొహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా.. 'ఆ రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుంటానేమో' అంటూ తాజాగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అవును... టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 36 ఏళ్ల వయసులో ఉన్న కొహ్లీని వరల్డ్ ఫిట్టెస్ట్ క్రికెటర్ అని కూడా అంటారు! వికెట్ల ముందు కొహ్లీ పరుగులకు.. ఫీల్డింగ్ లో అతడి మెరుపులకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు. అది కచ్చితంగా అతడి ఫిట్ నెస్ రహస్యమే!

వాస్తవానికి 128 సంవత్సరాల తర్వాత తొలిసారిగా లాస్ ఏంజిల్స్ లో 2028లో జరగనున్న ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చనున్నారు. అప్పుడు టీమిండియా ఫైనల్ కు చేరుకుంటే.. టీ20ల్లో తన రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకుంటానేమో అంటూ కొహ్లీ ప్రకటించాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొహ్లీ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సందర్భంగా... 2028 ఒలింపిక్స్ లో టీమిండియా ఫైనల్ కు చేరుకుంటే గనుక.. నేను ఆ ఒక్క మ్యాచ్ లో ఆడటంకోసమైనా టీ20ల్లో నా రిటైర్మెంట్ ను వెనక్కు తీసుకుంటాను.. ఒలింపిక్స్ లో పతకం గెలవడం నిజంగా అద్భుతమే కదా అని.. ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్లో కొహ్లీ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

కాగా.. ఐపీఎల్ సీజన్ 2025 నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో శనివారం కొహ్లీ కలిశాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంఛైజీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కింగ్ ఇక్కడున్నాడు.. అందరికన్నా రెండు అడుగులు ముందున్నాడు అని పోస్ట్ చేసింది.

ఇక ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఐదు మ్యాచుల్లో కొహ్లీ 218 పరుగులు చేశాడు. ఇక పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో శతకంతో అజేయంగా నిలిచి.. మరోసారి ఛేజింగ్ కింగ్ గా నిలిచాడు. సెమీస్ లో ఆసిస్ పైనా 84 పరుగులు చేసిన కొహ్లీ.. మొత్తం 54.50 యావరేజ్ నమోదు చేశాడు.

Tags:    

Similar News