9/10.. ఒక్కరు తప్ప ఐపీఎల్ కెప్టెన్లంతా భారతీయులే.. మరి తెలుగోడు?
గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లకు శుబ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్ లు ఈ సీజన్ కూ కెప్టెన్లుగా కొనసాగున్నారు.;
మరొక్క వారమే.. క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందడి మొదలుకానుంది.. పది జట్లు.. 2 నెలల 10 రోజులు.. 74 మ్యాచ్ లు.. ఇక హంగామానే హంగామా.. నవంబరులో జరిగిన మెగా వేలం తర్వాత చాలా జట్లకు కెప్టెన్లు మారారు. తాజాగా, చిట్టచివరిగా తెలుగువారి భాగస్వామ్యం ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ నిర్ధారణ అయింది.
అనుకున్నవారికే..
ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ గా స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను ఎంపిక చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ పేరు కూడా కెప్టెన్ గా వినిపించినా, చివరకు అతడే స్వచ్ఛందంగా తప్పుకొన్నాడు. దీనికిముందే లక్నో కెప్టెన్ గా రిషభ్ పంత్, పంజాబ్ కింగ్స్ కు శ్రేయాస్ అయ్యర్, కోల్ కతా కెప్టెన్ గా అజింక్య రహానే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథిగా బ్యాటర్ రజత్ పటిదార్ పేర్లను ప్రకటించారు. వీరంతా భారతీయులే కావడం గమనార్హం.
గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లకు శుబ్ మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్ లు ఈ సీజన్ కూ కెప్టెన్లుగా కొనసాగున్నారు. వీరు కూడా భారతీయులే.
హైదరాబాద్ కు తప్ప..
ఢిల్లీ కెప్టెన్ గా అక్షర్, రాహుల్ తో పాటు దక్షిణాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ పేరు కూడా వినిపించింది. చివరకు అక్షర్ నే ఖరారు చేశారు. దీంతో ఐపీఎల్ లో 10 జట్ల కు గాను 9 జట్లకు భారతీయులే సారథులు అయ్యారు. ఒక్క సన్ రైజర్స్ హైదరాబాద్ కు తప్ప.. ఈ ఫ్రాంచైజీకి ఆస్ట్రేలియా కెప్టెన్, పేస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ సారథిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, నెటిజన్లు ఇప్పుడు ఈ ఫ్రాంచైజీకీ ఇండియన్ కెప్టెన్ అయితే బాగుండని అంటున్నారు. అది కూడా తెలుగు యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని సూచిస్తున్నారు.. మరి మీరేమంటారు?