ఔను.. టీమ్ ఇండియా ప్రపంచ కప్ ల హీరోలిద్దరూ కలిశారు

ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలో జరిగిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ సోదరి వివాహానికి ధోనీ, గంభీర్ హాజరయ్యారు.;

Update: 2025-03-13 11:26 GMT

సమకాలికుల మధ్య ఎప్పుడైనా పోలికలు, విభేదాలు సహజం.. ఇది టీమ్ ఇండియాకూ మినహాయింపు కాదు.. సచిన్-గంగూలీ, ధోనీ-గంభీర్, ధోనీ-యువరాజ్, రోహిత్-కోహ్లి.. ఇలా ఇద్దరు ఆటగాళ్ల విభేదాలు ఉన్నాయంటూ ఎప్పుడూ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఇక గంభీర్ తో అయితే ధోనీకి అసలు పడదనే వాదన ఉంది.

వాస్తవానికి గంభీర్-ధోనీ ఇద్దరూ ఒకే సంవత్సరం (2004)లో టీమ్ ఇండియాకు ఎంపికయ్యారు. ఓపెనర్ గా గంభీర్ చాలా మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. అయితే, ధోనీ మాత్రం టీమ్ ఇండియా కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. గంభీర్ కెరీర్ మధ్యలో కాస్త నెమ్మదైంది. అది ధోనీ కెప్టెన్ గా ఉన్నప్పుడే జరిగింది. మరీ ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో ధోనీ, గంభీర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత గంభీర్ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. కానీ, ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు.

2015 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల నుంచి గంభీర్ ను ధోనీ ముందే తప్పించాడనేది ఆరోపణ. గంభీర్ నే కాదు సెహ్వాగ్, యువరాజ్ సింగ్ నూ ధోనీ పక్కనపెట్టాడనే విమర్శలు వచ్చాయి. దీంతోనే గంభీర్ కు ధోనీకి మధ్య అంతగా సఖ్యత లేదని చెప్పేవారు.

పదేళ్లకు పైగా ఐపీఎల్ లో ఆడినప్పటికీ గంభీర్, ధోనీ సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉన్నట్లు కనిపించలేదు. 2011 ప్రపంచ కప్ విజయం ఘనత మొత్తాన్ని ధోనీ ఖాతాలో వేయడం పట్ల గంభీర్ గతంలో వ్యతిరేకత వ్యక్తం చేశాడు.

అలాంటిది వీరిద్దరూ తాజాగా ఒకే వేదికపై కనిపించారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలో జరిగిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ సోదరి వివాహానికి ధోనీ, గంభీర్ హాజరయ్యారు. ఇద్దరూ కలిసి గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. దీంతో గంభీర్, ధోనీ కలిసిపోయారోచ్ అని అభిమానులు సంబరపడుతున్నారు.

కొసమెరుపు: 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ లోనే కాదు.. 2007 టి20 ప్రపంచ కప్ ఫైనల్స్ లోనూ గంభీర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అప్పుడూ జట్టు కెప్టెన్ ధోనీనే కావడం గమనార్హం.

Tags:    

Similar News