9 నెలల నిరీక్షణకు తెర.. భూమ్మీదకు సునీత.. సముద్రంలో ల్యాండింగ్
తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడుతూ భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ , మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరిగి భూమికి చేరుకునే క్షణం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయలు దేరారు.;
తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడుతూ భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ , మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరిగి భూమికి చేరుకునే క్షణం కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయలు దేరారు. 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్‌లో బయలుదేరిన వీరు వారం రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యలు వారిని ISSలోనే ఉండిపోవాల్సి వచ్చింది.. దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఈ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు ఇంటికి చేరుకోబోతున్నారు.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10:45 గంటలకు, క్రూ డ్రాగన్ వ్యోమనౌక యొక్క హాచ్ మూసివేసే ప్రక్రియ ప్రారంభమైంది. సునీత , బుచ్ తో మరో ఇద్దరు భూమిపైకి పయనమయ్యారు. వారి ముఖాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆనందం తాజాగా విడుదల చేసిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్షణం వారి సుదీర్ఘ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పొచ్చు.
అర్ధరాత్రి 12:45 గంటలకు, క్రూ డ్రాగన్ వ్యోమనౌక ISS నుండి విడిపోయింది. నెమ్మదిగా అంతరిక్ష కేంద్రం నుండి దూరంగా కదులుతున్న ఆ దృశ్యం నాసా వీడియోల్లో కనిపించింది. సునీత, బుచ్ తమ తాత్కాలిక నివాసానికి వీడ్కోలు పలికారు. భూమిపై ఉన్న తమ కుటుంబాలను కలుసుకునేందుకు బయలు దేరారు.
విజయవంతంగా విడిపోయిన తరువాత, మంగళవారం సాయంత్రం 4:45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనం ప్రారంభించనంది. భూమి యొక్క గురుత్వాకర్షణ వారిని మరింత వేగంగా లాగనుంది. సాయంత్రం 5:11 గంటలకు, వారు భూకక్ష్యలను దాటుకుని క్రిందికి రావడం మొదలుపెడుతారు. ప్రతి క్షణం భూమికి చేరువవుతున్న కొద్దీ వారిలో ఉత్కంఠ పెరుగడం ఖాయం.
చివరికి సాయంత్రం 5:57 గంటలకు అమెరికా ఫ్లోరిడా తీరానికి సమీపంలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ దిగనుంది. సురక్షితంగా నీటిపై తేలుతున్న క్యాప్సూల్‌ను నుంచి సునీత సహా వ్యోమగామలను నాసాకు తరలించనున్నారు. వైద్యపరీక్షలు చేసిన అనంతరం వారిని కుటుంబాలతో కలిపించనున్నారు.
2024 జూన్‌లో ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా వారు ఇంతకాలం అంతరిక్షంలో ఉండాల్సి వచ్చింది. వ్యోమగాములు లేకుండానే తిరిగి వచ్చిన స్టార్‌లైనర్ మళ్లీ వెళ్లలేదు. కానీ, ఇప్పుడు వారు క్షేమంగా తిరిగి రానుండడంతో వారి కుటుంబ సభ్యులు, నాసా సిబ్బంది ఆనందానికి అవధులు లేవు.
సునీత విలియమ్స్ , బుచ్ విల్మోర్ ఈ సుదీర్ఘమైన సవాలుతో కూడిన అంతరిక్ష యాత్ర ఎట్టకేలకు ముగియనుంది. వారు భూమిపై తిరిగి వచ్చే క్షణం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. 9 నెలలుగా వారి ధైర్యం సహనానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా చెప్పొచ్చు.