అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల దుర్మరణం
ఈ ప్రమాద ఘటనపై టేకులపల్లి మాజీ సర్పంచ్, మృతురాలు ప్రగతి రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.;
అమెరికాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకుంది. మృతి చెందిన వారిని రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి (35), ఆమె ఆరేళ్ల కుమారుడు హార్వీన్, ప్రగతి రెడ్డి అత్త సునీత (56)గా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొనడంతో ప్రమాదంలో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అకాల మరణం చెందడంతో టేకులపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ప్రమాద ఘటనపై టేకులపల్లి మాజీ సర్పంచ్, మృతురాలు ప్రగతి రెడ్డి తండ్రి మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, దురదృష్టవశాత్తు తన చిన్న కుమార్తె ఈ ప్రమాదంలో మృతి చెందిందని ఆయన తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో ప్రగతి రెడ్డి తన కుమారుడు, అత్తతో కలిసి సమీపంలోని ఫ్లోరిడాకు పిక్నిక్ కోసం వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. పిక్నిక్ ముగించుకుని తిరిగి వస్తుండగా వారి కారును ట్రక్క ఢీకొట్టిందని.. ఈ దుర్ఘటనలో తన చిన్న కుమార్తె ప్రగతి రెడ్డి, ముద్దుల మనవడు హార్వీన్, కోడలి తల్లి సునీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని ఆయన రోదనతో చెప్పారు. ఈ విషాద వార్త తమ పెద్ద కుమార్తె ద్వారా తమకు తెలిసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత 15 సంవత్సరాలుగా ప్రగతి రెడ్డి అమెరికాలోనే స్థిరపడ్డారని మోహన్ రెడ్డి తెలిపారు. ఆమె మృతితో తమ కుటుంబంలో వెలుగులు ఆరిపోయాయని, తమకు దిక్కెవ్వరని ఆయన గుండెలు పగిలేలా విలపించారు. తమ అల్లుడు కుటుంబంలో కూడా చీకట్లు కమ్ముకున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె, మనవడిని కడసారి చూసుకునేందుకు అమెరికాకు వెళ్లేందుకు తాము టికెట్లు బుక్ చేసుకున్నామని ఆయన తెలిపారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో టేకులపల్లి గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది. గ్రామంలోని వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మోహన్ రెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఎంతో సంతోషంగా గడిపిన ఆదివారం రోజు ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలచివేస్తోంది. గత 13 ఏళ్లుగా అమెరికాలో ఉన్న ప్రగతి రెడ్డి ఉన్నట్టుండి ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.
వీరు ప్రయణిస్తున్న కారును ట్రక్కు ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిస్తే కానీ అసలు ఏం జరిగిందనేది స్పష్టంగా తెలియదు. అయితే ఈ దుర్ఘటన మాత్రం టేకులపల్లి గ్రామంలో తీరని విషాదాన్ని నింపింది.