అమరావతికి బిగ్ న్యూస్.. హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు
అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు ఆదివారం ఒప్పందం కుదుర్చుకుంది.;
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాజధాని నిర్మాణానికి సుమారు రూ.64 వేల కోట్లు నిధులు అవసరం ఉండగా, ప్రభుత్వం ఆ మేరకు నిధుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లకు రుణ ప్రణాళిక విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మరో పెద్ద మైలురాయిని ప్రభుత్వం చేరుకుంది. అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు ఆదివారం ఒప్పందం కుదుర్చుకుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, మున్సిపల్ అధికారులతో హడ్కో ఈ ఒప్పందం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలెప్మమెంట్ కార్పొరేషన్ (హడ్కో) దేశంలో పట్టణాభివృద్ధికి రుణాలు అందజేస్తుంటుంది. ఈ క్రమంలోనే అమరావతి నిర్మాణానికి జనవరిలో హడ్కో పాలకవర్గం ఆమోదం తెలిపింది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఆదివారం హడ్కో, సీఆర్డీఏ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండవల్లిలో మంత్రి నారాయణతోపాటు హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠతో సమావేశం జరిగింది. గతంలో నిర్ణయించినట్లు అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్లు రుణంగా అందజేసే విధివిధానాలను పూర్తి చేశారు. దీంతో త్వరలో రూ.11 వేల కోట్లు రాష్ట్రానికి విడుదల కానున్నాయి. దీంతో రాజధాని పనులు వేగవంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హడ్కో అందజేస్తున్న ఈ రుణాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెబుతున్నారు.