ఒక్క కన్నీటి వీడియో ఆ విద్యార్థిని తలరాత మార్చింది.. కేంద్రమంత్రిని కదిలించింది
పెళ్లి చేసి అత్తారింటికి పంపి తమ బాధ్యతను దించేసుకోవాలనుకునే తల్లిదండ్రులే ఎక్కువ. బీహార్ లో ఎంతో బాగా చదివే అమ్మాయికి కూడా అదే పరిస్థితి ఎదురైంది.;
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతాయి.. కొన్ని కన్నీళ్లను తుడుస్తాయి.. ఇప్పుడు ఇదే జరిగింది. వెనుకబడిన బీహార్ జిల్లాలో ఇప్పటికీ అమ్మాయిలను చదివించడం వృథా అని భావిస్తారు. వారిపై ఖర్చు పెట్టడం దండగ అని.. పెళ్లి చేసి అత్తారింటికి పంపి తమ బాధ్యతను దించేసుకోవాలనుకునే తల్లిదండ్రులే ఎక్కువ. బీహార్ లో ఎంతో బాగా చదివే అమ్మాయికి కూడా అదే పరిస్థితి ఎదురైంది. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె వీడియో ఆమెకు ఒక కొత్త దారిని చూపించింది.
ఖుష్బూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇంటర్వ్యూలో తన బాధను వెళ్లబోసుకుంటున్న ఆమె మాటలు వింటుంటే గుండె తరుక్కుపోయింది. పదో తరగతి పరీక్షల్లో 500కు 400 మార్కులు తెచ్చుకోవాలని తన తల్లిదండ్రులు లక్ష్యం పెట్టారు. ఖుష్బూ బాగానే చదివింది. కానీ, దురదృష్టవశాత్తూ ఒకే ఒక్క మార్కు తక్కువగా వచ్చింది - 399. ఆ ఒక్క మార్కు చాలు, ఆమె జీవితాన్ని మలుపు తిప్పడానికి.. అదే జరిగింది..
ఖుష్బూకి సైన్స్ అంటే ప్రాణం. డాక్టర్ అవ్వాలని కలలు కంటోంది. కానీ, ఆ ఒక్క మార్కు కారణంగా ఆమెను సైన్స్ కోర్సులో చేరకుండా ఆర్ట్స్‌లో చేర్పించారు. ఇంట్లో తన పట్ల చూపిస్తున్న పక్షపాతం గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన అన్నయ్యలకు సైన్స్ చదివే అవకాశం ఇచ్చారని, తనకు మాత్రం ఒక్క మార్కు తక్కువ వచ్చిందని తన కలలను కాలరాశారని కన్నీటితో చెప్పింది.
ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయాలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఎంతోమంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ విషయం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి కూడా వెళ్లింది. ఆయన వెంటనే స్పందించారు. ఒకరోజు ఖుష్బూ ఫోన్ మోగింది. అవతలివైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. ఖుష్బూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. మంత్రి గారు ఆమెతో మాట్లాడారు. సైన్స్ విభాగంలో అడ్మిషన్ గురించి దానాపూర్ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు.
"నీకు నచ్చిన సబ్జెక్టు చదువుకునేందుకు ప్రధాని మోదీ, సీఎం నీతీశ్ కుమార్ ప్రభుత్వాలు నీకు అండగా ఉన్నాయి. ఈ విషయమై నేను ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. నువ్వు తప్పకుండా నీట్ పరీక్షకు కూడా ప్రిపేర్ అవ్వాలి. డాక్టర్ కావాలనే నీ కలను నెరవేర్చుకోవాలి," అని మంత్రి గారు ఖుష్బూకి భరోసా ఇచ్చారు.
ఖుష్బూ కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు తిరిగాయి. కానీ ఈసారి అవి బాధతో వచ్చినవి కావు. ఆనందంతో వచ్చినవి. తన కష్టాన్ని గుర్తించి, తన కలను నిజం చేయడానికి ఒక పెద్ద మనిషి అండగా నిలబడటం ఆమెకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఒకే ఒక్క మార్కుతో తన జీవితం ముగిసిపోయిందని అనుకున్న ఖుష్బూకి, ఇప్పుడు మళ్ళీ ఆశ చిగురించింది. తన కలల వైపు ఆమె ధైర్యంగా అడుగులు వేయడానికి సిద్ధమైంది.