ట్రంప్, తనది ఒకటే పాలసీ అంటున్న మోడీ

ప్రధాని మోడీ నేరుగా మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడడం చాలా తక్కువ. ఇప్పటికీ కాంగ్రెస్ ఇదే విమర్శలు గుప్పిస్తుంటుంది.;

Update: 2025-03-17 04:17 GMT

ప్రధాని మోడీ నేరుగా మీడియా ఇంటర్వ్యూల్లో మాట్లాడడం చాలా తక్కువ. ఇప్పటికీ కాంగ్రెస్ ఇదే విమర్శలు గుప్పిస్తుంటుంది. దమ్మున్న యాంటీ జర్నలిస్టులతో ఇంటర్వ్యూల్లో పాల్గొనాలని సవాల్ చేస్తుంటుంది. కానీ మోడీ మాత్రం తనకు అనుకూలురైన కొద్ది మంది జర్నలిస్టులతోనే చాలా అరుదుగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. ఇప్పుడు కూడా ఒక విదేశీ పాడ్ కాస్టర్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అందులోనూ వివాదాస్పద అంశాల జోలికి పోకుండా కేవలం తన మార్క్ ఉండేలానే చూసుకున్నారన్న విమర్శలు కాంగ్రెస్ నుంచి వచ్చాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ప్రముఖ అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో సుదీర్ఘ సంభాషణలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన డొనాల్డ్ ట్రంప్‌తో తనకున్న అనుబంధాన్ని, తన ప్రభుత్వ పాలనా సంస్కరణలను గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మోదీ మాట్లాడుతూ "హౌడీ మోదీ" కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ చూపిన ఆత్మీయతను గుర్తు చేసుకున్నారు. తన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్న ట్రంప్, భద్రతా నియమాలను సైతం పక్కన పెట్టి తనతో కలిసి స్టేడియం చుట్టూ తిరిగి ప్రేక్షకులకు అభివాదం చేయడం ఆయనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మోదీ అన్నారు. ట్రంప్‌తో తనకు బలమైన స్నేహబంధం ఉందని, ఆయన తనపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్రంప్ "అమెరికా ఫస్ట్" విధానం తన "నేషన్ ఫస్ట్" , "భారత్ ఫస్ట్" సిద్ధాంతాలకు సరిగ్గా సరిపోతుందని మోదీ పేర్కొన్నారు. ఇద్దరు నేతల మధ్య ఉన్న ఈ ఉమ్మడి దృక్పథం సహజమైన సమన్వయాన్ని సృష్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వివిధ వేదికలపై ట్రంప్ తనను కఠినమైన నెగోషియేటర్ గా బహిరంగంగా ప్రశంసించినందుకు మోదీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్‌కు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని, తనకు భారత్ ప్రయోజనాలే ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. తన దృష్టి కేవలం భారతదేశ ప్రయోజనాలపైనే ఉంటుందని, ఇది ఇతరులకు హాని కలిగించడం కాదని, 140 కోట్ల మంది భారతీయులు తనపై ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చడమే తన లక్ష్యమని మోడీ అన్నారు. ప్రస్తుత టర్మ్‌లో ట్రంప్ చాలా ఫోకస్డ్ గా ఉన్నారని, బలమైన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారని మోదీ అభిప్రాయపడ్డారు. ఆ బృందంలోని చాలా మందిని తాను కలిశానని ఆయన తెలిపారు.

అనంతరం మోదీ తన పాత స్నేహితుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి మస్క్‌తో తనకు పరిచయం ఉందని ఆయన చెప్పారు. ఇటీవల జరిగిన వారి సమావేశం చాలా ఆత్మీయంగా, కుటుంబ సభ్యుల్లా జరిగిందని మోదీ అన్నారు. మస్క్ ప్రభుత్వ కార్యాలయాల సామర్థ్యాన్ని సూచించే "DOGE" (డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) గురించి చూపిన ఉత్సాహాన్ని ఆయన పంచుకున్నారు.

తన ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణల గురించి వివరిస్తూ, సమర్థత , పారదర్శకత అనే సూత్రాలు ఇప్పటికే తమ ప్రభుత్వ విధానాల్లో భాగమని మోదీ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల నుండి 10 కోట్ల నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించామని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా నిజమైన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తూ ప్రయోజనాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఒక్క చర్యతోనే దేశానికి రూ. 3 లక్షల కోట్లు ఆదా అయ్యిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, మోదీ ప్రభుత్వం 1,500 కాలం చెల్లిన చట్టాలను.. 45,000కు పైగా అనవసరమైన నిబంధనలను తొలగించిందని, తద్వారా పరిపాలనను మరింత సరళంగా, పౌర-స్నేహపూర్వకంగా మార్చిందని ఆయన వివరించారు.

ఈ పోడ్ కాస్ట్ ద్వారా మోదీ విశ్వాసం, సహకారం, ప్రజలకు ఫలితాలు అందించడంపై దృష్టి సారించిన తన నాయకత్వ శైలిని స్పష్టం చేశారు.

Tags:    

Similar News