సాయిరెడ్డి అలా తగులుకున్నారేంటి?
రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఇరకాటంగా మారుతోంది.;
రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి వ్యవహారం మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఇరకాటంగా మారుతోంది. పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూనే విజయసాయిరెడ్డి వైసీపీ అంతర్గత వ్యవహారాలపై ప్రకటనలు చేయడం, జగన్ తీరుపై ట్వీట్లు చేయడం ఆసక్తి రేపుతోంది. రెండు రోజుల క్రితం సీఐడీ విచారణకు వచ్చిన విజయసాయిరెడ్డి వైసీపీలో కోటరీ పెరిగిపోయిందని, అధినేత జగన్ చుట్టూ చేరిన కోటరీ వల్లే తాను వైసీపీతో తెగతెంపులు చేసుకోవాల్సివచ్చిందని చెప్పిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా గత ప్రభుత్వంలో జరిగిన స్కాంలపైనా కొన్ని లీకులిచ్చారు. కాకినాడ సీపోర్ట్సు వాటాల బదిలీలో తన పాత్ర లేదంటూనే కర్త, కర్మ, క్రియ అంతా జగన్ తమ్ముడు విక్రాంత్ రెడ్డేనంటూ బాంబు పేల్చారు విజయసాయిరెడ్డి. ఇక అంతటితో ఆగకుండా రాష్ట్రంలో చర్చనీయాంశమైన లిక్కర్ స్కాం సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ మరో లీకు ఇచ్చారు. ఈ రెండు విషయాలే వైసీపీని కుదిపేస్తుండగా, తాజాగా సాయిరెడ్డి చేసిన ట్వీట్ మరింత అగ్గి రాజేస్తోంది.
రాజు ప్రజల్లోకి వెళ్లకపోతే.. కోటరీ, కోట ఏదీ మిగలదు అంటూ తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. జగన్ తన బంగ్లా దాటి రాకుండా కోటరీ చెప్పిన మాటలు వింటే తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయిపోవాల్సివుంటుందనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఆ ట్వీట్ చేశారంటున్నారు. వైసీపీతో తెగతెంపులు చేసుకున్నానని చెబుతూనే వైసీపీపై ఆయన కామెంట్స్ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది. ‘పూర్వకాలంలో మహరాజులు కోటల్లో ఉండేవారు. తమ రాజ్యంలో ఏం జరుగుతుందో పక్కన ఉండే కోటరీని అడిగి తెలుసుకునేవారు.
ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా.. ఆహా రాజా.. ఓహో మహరాజా అంటూ పొగడ్తలతో రాజు కళ్లకు గంతలు కట్టి కోటరీ తన ఆటలు సాగించుకునేది. దీంతో రాజూ పోయేవాడు. రాజ్యం కూడా పోయేది. మహారాజు తెలివైన వాడు అయితే మారు వేషంలో ప్రజల్లోకి వచ్చి రాజ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు. కోటరీ మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి. ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. లేదంటే కోటరీ వదలదు. కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలోనైనా జరిగేది ఇదే.. అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ప్రశాంత జీవితం గడుపుతానని చెబుతున్న విజయసాయిరెడ్డి వైసీపీలో కల్లోలం రేపేలా ట్వీట్లు, ప్రకటనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. తాను వదిలేసిన వైసీపీకి భవిష్యత్ లేదని రెండు రోజుల క్రితం చెప్పడమే కాకుండా, ఇప్పుడు ట్వీట్ ద్వారా వైసీపీ మునిగిపోతోందని చెప్పడం కూడా మంట పుట్టిస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా చేసినప్పుడు ఎవరూ ఆయనపై వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ, విజయసాయిరెడ్డి స్వరంలో మార్పు కనిపిస్తుండటంతో ఇప్పుడు వైసీపీ కూడా సీరియస్ గానే స్పందిస్తోంది.
జగన్ రెండో సారి అధికారంలోకి వస్తే విజయసాయిరెడ్డి ఇలా రాజీనామా చేసేవారా? అంటూ ప్రశ్నిస్తోంది. ఏదిఏమైనా వైసీపీలో నెంబర్ 2 లీడర్ గా చలామణీ అయిన విజయసాయిరెడ్డి తీరు వల్ల ఆ పార్టీ నేతలు తల పట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. రాజకీయ సన్యాసం అంటూ ప్రకటించి ఇప్పుడు తమను ఇబ్బంది పెట్టే నీతులు చెప్పడం పట్ల వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.