అక్క ప్లేసులో తమ్ముడు.. భూమాపై సీఎంవోకి ఫిర్యాదు
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముడు భూమా జగత్ విక్యాత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లింది.;
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముడు భూమా జగత్ విక్యాత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు వెళ్లింది. ఈ ఫిర్యాదును ఎవరో అల్లాటప్ప వ్యక్తులు చేయలేదు. సాక్ష్యాత్తూ టీడీపీ మంత్రులే భూమా తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారని వార్తలు ప్రచారమవుతున్నాయి. దీంతో ఈ విషయం సీమ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక రాజకీయ గుర్తింపు ఉంది. అయితే భూమా అఖిలప్రియ బదులు ఆమె సోదరుడు జగత్ విక్యాత్ రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భూమా కుటుంబానికి ఆళ్లగడ్డతోపాటు నంద్యాల అసెంబ్లీ స్థానంలో వర్గం ఉంది. అయితే గత ఎన్నికల్లో నంద్యాల టికెట్ ను మైనార్టీ నేత ఎన్ఎండీ ఫరూక్ కు కట్టబెట్టారు. ఎన్నికల్లో గెలిచిన ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అడపాదడపా నంద్యాల రాజకీయాల్లోనూ భూమా కుటుంబ సభ్యులు తలదూర్చుతున్నారని మంత్రి ఫరూక్ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. భూమాకు చెక్ పెట్టేందుకు ఆయన చాలా కాలంగా ఎదురుచూస్తున్నారనే టాక్ నడుస్తోంది.
ఇదే సమయంలో శనివారం నంద్యాల కలెక్టరేట్ లో జరిగిన అధికారిక సమావేశానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విక్యాత్ రెడ్డి హాజరుకావడంతో మంత్రి ఫరూక్ కు అవకాశం అందివచ్చినట్లైందని అంటున్నారు. ఈ సమావేశంలో ఫరూక్ తోపాటు జిల్లాకు చెందిన మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కానీ, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అందుబాటులో లేకపోవడంతో హాజరుకాలేకపోయారు. తన బదులుగా తమ్ముడు జగత్ విక్యాత్ రెడ్డిని పంపారు.
అధికారిక సమావేశానికి విక్యాత్ రెడ్డి రావడాన్ని మంత్రులు తప్పుబట్టారు. ఏ హోదా లేకుండా భూమా విక్యాత్ రెడ్డి అధికారులను ప్రశ్నించడం కూడా మంత్రుల ఆగ్రహానికి కారణమైంది. ఎమ్మెల్యే సోదరుడు అయినంత మాత్రాన అధికారిక సమావేశాలకు రావడానికి వీలు లేదని, ప్రజాప్రతినిధిగా అధికారులను నిలదీయడం కరెక్టు కాదంటూ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు రూపంలో చేరవేశారని సమాచారం. దీంతో ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగి అసలు ఏం జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నాయి.