అత్యంత కిరాతక నేరస్తుడితో మోదీ ఆలింగనమా?!

మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం రష్యాకు బయలుదేరి వెళ్లారు

Update: 2024-07-09 10:12 GMT

మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం రష్యాకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రష్యాలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఆ దేశాధినేత పుతిన్‌.. మోదీ గౌరవార్థం ప్రత్యేక రాత్రి విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్‌ పరస్పరం ఆలింగనం చేసుకుని ఇరు దేశాల మితృత్వాన్ని చాటారు. మోదీ–పుతిన్‌ ఆలింగనం దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ తీవ్రంగా స్పందించారు. పుతిన్‌ తో మోదీ భేటీ కావడం తమను నిరాశకు గురిచేసిందన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం ఉక్రెయిన్‌ పై రష్యా దండెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఎంతోమంది చిన్నారులు, మహిళలు, ఇతర ప్రజలు మృత్యువాత పడ్డారు. భారీ ఎత్తున ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇప్పటివరకు ఉక్రెయిన్‌ లో వేలాది మంది ప్రజలు మరణించారు.

ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్‌ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ.. మోదీ, పుతిన్‌ భేటీపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడు అత్యంత కిరాతక నేరస్తుడితో ఆలింగం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

ఉక్రెయిన్‌ పై తాజాగా రష్యా జరిపిన క్షిపణి దాడిలో 37 మంది మరణించారు. వీరిలో ముగ్గురు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరో 13 మంది పిల్లలు సహా 170 మంది గాయాలపాలయ్యారు. అంతేకాకుండా రష్యా సైన్యం చిన్నారుల ఆస్పత్రిపైనా క్షిపణులతో దాడి చేసింది, దీంతో ఎంతో మంది మృత్యువాత పడ్డారు. శిథిలాల్లో చిక్కుకున్నారు.

ఈ క్రమంలోనే పుతిన్‌ ను ఉద్దేశించి అత్యంత కిరాతకుడైన నేరస్తుడితో మోదీ ఆలింగనం తనకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బ లాంటిదే అని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా దాడికి సంబంధించిన ఫొటోలను జెలెన్‌ స్కీ ఎక్స్‌ లో పోస్టు చేశారు.

కాగా ఓవైపు మోదీ పర్యటన రష్యాలో కొనసాగుతున్నప్పుడు ఉక్రెయిన్‌ పై ఆ దేశం భీకర దాడులతో విరుచుకుపడింది. ఏకంగా 40 క్షిపణులను ప్రయోగించడంతో అనేక అపార్టుమెంట్లు, భవంతులు, ఆస్పత్రులు కుప్పకూలాయి.

రష్యా పర్యటనలో మోదీ సైతం యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్‌ ను కోరారు. సమస్య ఏదైనా శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకోవాలన్నారు. దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని తేల్చిచెప్పారు.

Tags:    

Similar News