70.. 75.. మరి మోదీకి లేదా వీఆర్ఎస్?

పాత తరం బీజేపీ పోయి కొత్త తరం వచ్చింది. నాటి విలువలూ మారాయి. మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టే విషయంలో.

Update: 2024-02-06 17:30 GMT

ఆడ్వాణీ, వాజపేయీ హయాంలో బీజేపీ అంటే క్రమశిక్షణకు మారు పేరు. వారితరంలోని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా అంతే క్రమశిక్షణతో ఉండేవారు. ఇక రాజకీయాలూ హుందాగానే చేశారు. మెజార్టీ లేకుంటే దిగిపోవడం, తక్కువ సీట్లు వస్తే ప్రతిపక్షంలో కూర్చోవడం వంటివి ఈ కోవలోనివే. అదేవిధంగా బీజేపీ సంస్థాగతంగానూ కఠిన నిర్ణయాలు తీసుకునేది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రభావం అయితేనేం.. నాయకులంతా ఒక వయసు వచ్చాక దిగిపోవాలనేది నియమంగా పెట్టుకుంది. దీనికి 70 ఏళ్లను కటాఫ్ గా తీసుకుంది. ఈ ప్రమాణం ప్రకారం చాలామంది బీజేపీ నాయకులు క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.

తరం మారింది.. నిబంధన మారింది..

పాత తరం బీజేపీ పోయి కొత్త తరం వచ్చింది. నాటి విలువలూ మారాయి. మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ప్రభుత్వాలను ఇబ్బందిపెట్టే విషయంలో. అలానే రిటైర్మెంట్ గురించి కూడా. మోదీ ప్రధాని అయ్యాక బీజేపీ పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మోదీ ఒక్కసారి కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించలేదు. ఆడ్వాణీ మూడుసార్లు పార్టీ చీఫ్ అయ్యారు. వాజ్ పేయి పార్టీ ప్రారంభించిన 1980 నుంచి ఆరేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా మోదీ ప్రధాని అయ్యాక.. ఆయన అనుంగు అనుచరుడు అమిత్ షా, ఆ తర్వాత జేపీ నడ్డాలకు పార్టీ పగ్గాలు దక్కాయి. మరోవైపు ఈ కాలంలోనే పార్టీ క్రమశిక్షణ నిబంధనలు కాస్త మారినట్లుగానూ అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా 70 ఏళ్లు దాటాక రిటైర్మెంట్ విషయంలో.

వెంకయ్య తప్పుకొన్నారు.. మరి మోదీ?

తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినవారు. వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్. వీరిలో వెంకయ్య ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముగిశాక రాష్ట్రపతి అవకాశం దక్కుతుందేమోనని చూశారు. కానీ, ఇవ్వకపోవడంతో క్రియాశీల రాజకీయాల నుంచి దాదాపు తప్పుకొన్నారు. వెంకయ్య వయసు 74. అంటే.. పార్టీ నిబంధన ప్రకారం ఆయన రిటైరయ్యారు. అయితే, ఇదే వయసు ఉన్న ప్రధాని మోదీ మాత్రం తాను వచ్చే టర్మ్ లోనూ పోటీ చేస్తానని చెబుతున్నారు. వాస్తవానికి రాజకీయాల్లో మోదీ కంటే వెంకయ్యే సీనియర్. 1978లోనే వెంకయ్య ఎమ్మెల్యే. అప్పటికి మోదీ ఏం చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియదు. కాగా.. ఇప్పుడు మాత్రం మోదీ మరో ఐదేళ్లు అంటే 80 ఏళ్ల వయసు వరకు రాజకీయాల్లో కొనసాగే ఉద్దేశంలో ఉన్నారని తెలుస్తోంది. అంటే.. 70 ఏళ్ల నిబంధనను పక్కనపెట్టేశారన్నమాట.



Tags:    

Similar News