ఒట్టు తీసి గట్టు మీద పెడుతున్న ముద్రగడ ?

గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి పెద్దన్నగా సీనియర్ రాజకీయ నేతగా దశాబ్దాల తరబడి అనుభవం ఉన్న ముద్రగడ పద్మనాభం మాటంటే మాటే అన్నది అందరికీ తెలిసిందే.

Update: 2024-11-30 03:29 GMT

గోదావరి జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి పెద్దన్నగా సీనియర్ రాజకీయ నేతగా దశాబ్దాల తరబడి అనుభవం ఉన్న ముద్రగడ పద్మనాభం మాటంటే మాటే అన్నది అందరికీ తెలిసిందే. ఆయన ఎపుడూ ఒకే మాట మీద ఉంటారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే తాను పేరు మార్చుకుంటాను అని సవాల్ చేసి దానికి కట్టుబడి పద్మనాభరెడ్డి అని మార్చుకున్న వైనం ఇటీవలనే అంతా చూసారు.

అంత పట్టుదల కలిగిన మనిషి అయిన ముద్రగడ ఇపుడు ఈ ఏజ్ లో ఈ స్టేజ్ లో తన పంతాన్ని పట్టుదలను కాస్తా వీడుతున్నారా అన్న చర్చకు తెర లేస్తోంది.ఇంతకీ ముద్రగడ దేని మీద పంతం పట్టారు దేని విషయంలో ఆయన పట్టుదలను తగ్గించుకుంటున్నారు అంటే అది ఒక ఆసక్తికరమైన రాజకీయమే మరి.

ముద్రగడ పద్మనాభానిది సొంత నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు 1962, 1967లలో ఇక్కడ నుంచే రెండు సార్లు పోటీ చేసి గెలిచారు. ఆయన మరణం తరువాత 1978లో ముద్రగడ ఇదే సీటు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు

ఆ తరువాత ఆయన టీడీపీలో చేరారు. 1983, 1985లలో ఆయన ఇదే సీటు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఇదే సీటు నుంచి ఘన విజయం సాధించారు. అయితే 1994లో మాత్రం ముద్రగడ ఈ సీటు నుంచి పోటీ చేస్తే తొలిసారి ఓటమిని చవి చూశారు

దాంతో ముద్రగడ పూర్తిగా రాజకీయ నిర్వేదానికి లోనై ఇక ఈ జన్మలో ప్రత్తిపాడు నుంచి పోటీచేయనని ప్రకటించారు. అక్కడకు అడుగు పెట్టను అని కూడా శపధం చేశారు. అయితే ఆయనను 2009లో వైఎస్సార్ పిలిచి మరీ ప్రత్తిపాడు నుంచి పోటీచేయాలని అడిగారు.

కానీ ఆయన ప్రత్తిపాడు నుంచి చేయనని మరోసారి చెప్పేశారు. అంతే కాదు కాపు ఓటర్లు అధికంగా గల పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పి టికెట్ తెచ్చుకున్నారు. అయినా ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇపుడు ప్రత్తిపాడు వైపు ముద్రగడ చూస్తున్నారు అని టాక్ నడుస్తోంది.

మరి ప్రత్తిపాడులో పోటీ చేయను అని చెప్పిన ముద్రగడ మళ్లీ ఎందుకు ఆ వైపు వస్తున్నారు అన్నదే చర్చగా ఉంది. అయితే తన కోసం కాదని తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం అని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారని ప్రచారం సాగుతోంది.

తన కుమారుడు గిరిబాబుని ప్రత్తిపాడు నుంచి వైసీపీ ఇంచార్జిగా అధినాయకత్వం నియమిస్తుందని అంటున్నారు. ముద్రగడ ఆయన తండ్రి ప్రాతినిధ్యం వహించిన ప్రత్తిపాడు నుంచి తన వారసుడిని పోటీకి దించి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని ముద్రగడ చూస్తున్నారు అని అంటున్నారు. ఇక పిఠాపురం మీద మక్కువ ఉన్నా ఆ సీటు పవన్ కి కన్ ఫర్మ్ అని అంటున్నారు

ఆయనే మళ్లీ అక్కడ నుంచి పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. దాంతో కుమారుడి భవిష్యత్తు దృష్ట్యా ముద్రగడ తన పట్టు సడలించుకుని ప్రత్తిపాడు నుంచి వారసుడిని దించి వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబెట్టి గెలిపించుకోవాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది. అదే జరిగితే మూడు దశాబ్దాల క్రితం తాను పట్టిన శపధాన్ని ముద్రగడ పక్కన పెట్టి ప్రత్తిపాడుకు తన ఫ్యామిలీని చేరువ చేస్తున్నట్లుగానే భావించాలని అంటున్నారు.

Tags:    

Similar News