వర్మకు పదవి దక్కకపోవడంపై నాదెండ్ల కీలక వ్యాఖ్యలు

పిఠాపురం జనసేన అడ్డా అని నాదెండ్ల చెప్పుకొచ్చారు. పార్టీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబుని తీసుకోవడం వెనక ఏమీ వ్యూహాలు లేవని అన్నారు.;

Update: 2025-03-10 13:26 GMT

పిఠాపురంలో టీడీపీ ఇంచార్జి సీనియర్ నేత ఎస్వీఎస్ ఎన్ వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం అన్నది పూర్తిగా టీడీపీ అంతర్గత వ్యవహారం అని జనసేనలో నంబర్ టూగా ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దానితో తమకు సంబంధం లేదని అన్నారు. వర్మ సీనియర్ నాయకుడు అని నాదెండ్ల చెప్పారు. ఆయనకు పదవి దక్కకుండా చేయాల్సిన అవసరం కానీ చెక్ పెట్టాల్సిన అవసరం కానీ జనసేనకు ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

మరో వైపు చూస్తే వర్మకు పదవి వస్తే ఎక్కువగా సంతోషించేది పవన్ కల్యాణే అని కూడా అన్నారు. అందరికీ అవకాశాలు రావాలని ఆలోచించే నాయకుడు పవన్ అని అన్నారు. వర్మ కూటమిలో నేత అని పొత్తులో భాగంగా పవన్ గెలుపు కోసం ఆయన సహకరించారని నాదెండ్ల చెప్పారు.

పిఠాపురం జనసేన అడ్డా అని నాదెండ్ల చెప్పుకొచ్చారు. పార్టీలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబుని తీసుకోవడం వెనక ఏమీ వ్యూహాలు లేవని అన్నారు. ఎన్నికల ముందే ఆయన పార్టీలో చేరాల్సి ఉందని కొన్ని కారణాల వల్లనే ఆగారని అంటూ దొరబాబుని తమ కుటుంబ సభ్యుడిగా చెప్పుకొచ్చారు.

ఆయనను తాము అంతా గౌరవిస్తామని కూడా అన్నారు. ఏది ఏమైనా వర్మకు పదవి దక్కకపోవడం అన్నది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమే తప్ప మరేమీ కాదని అన్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలోనూ బయటా జరుగుతున్న చర్చకు ఆయన ఈ విధంగా తెర దించేశారు. మరి దీని మీద పిఠాపురం వర్మ అనుచరులు ఏ విధంగా రియాక్టు అవుతారో చూడాల్సి ఉంది.

అదే విధంగా ఏపీలో కూటమి కట్టడానికి చొరవ చూపించిందే పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తలచుకోవడం వల్లనే కూటమి అన్నది ఒకటి ఏర్పాటు అయింది అని ఆయన చెప్పారు. కూటమిలో పార్టీల మధ్య పొత్తుల కోసం పవన్ ఎంతో శ్రమకోర్చారని మరెంతో చొరవ తీసుకున్నారని నాదెండ్ల అన్నారు. పవన్ ఈ విధంగా చేయడం వల్లనే ఒక్క ఓటు కూడా చీలలేదని బంపర్ విక్టరీ సాధ్యపడిందని అన్నారు.

Tags:    

Similar News