బాబు లోకేష్ తప్ప ఆయన పేరు ఎత్తని వర్మ !

అయితే వర్మ తన పాతికేళ్ళ రాజకీయ అనుభవాన్ని రంగరించి చూపించారు. ఎంతో పరిణతితో ఆయన వ్యవహరించారు.;

Update: 2025-03-10 13:39 GMT

పిఠాపురం వర్మ టాక్ ఆఫ్ ది డే గా నిలిచారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కక పోవడం మీదనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఆయనకు అనుకూలంగా మరో విధంగా ఈ చర్చ సాగుతూనే ఉంది. తనకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదని వర్మ ఏమి చేస్తారు అన్నది కూడా అంతా ఆసక్తిగా చర్చించుకున్నారు.

అయితే వర్మ తన పాతికేళ్ళ రాజకీయ అనుభవాన్ని రంగరించి చూపించారు. ఎంతో పరిణతితో ఆయన వ్యవహరించారు. నిజానికి అయితే ఎవరైనా ఆశావహులు షాక్ కి గురి అయితే ఒకటి రెండు రోజుల పాటు మీడియా ముందుకు రారు. కానీ వర్మ మాత్రం వెంటనే మీడియా ముందుకు వచ్చారు.

అంతే కాదు తన అనుచరులను పార్టీ కార్యకర్తలను కూడా ఆయన ఉద్దేశించి మాట్లాడారు. అంతా చంద్రబాబుకు లోకేష్ కి అండగా ఉండాలని కోరారు. చంద్రబాబు పట్ల పూర్తి విశ్వాసం ప్రకటించారు. అదే సమయంలో లోకేష్ ని భవిష్యత్తు ఆశాకిరణం అని యువ రధ సారధి అని వర్మ కొనియాడారు.

తాను చంద్రబాబు లోకేష్ ఆదేశాలతోనే 2024 ఎన్నికల్లో పిఠాపురంలో కూటమి గెలుపు కోసం కృషి చేశాను అని చెప్పిన వర్మ కూటమి గెలిచింది అని అన్నారు తప్ప పవన్ కళ్యాణ్ పేరు మాత్రం చెప్పలేదని అంతా చర్చించుకుంటున్నారు. అదే సమయంలో కూటమి విజయం కోసం అని ఆయన అంటూ వచ్చారు.

ఇక పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ని కాపాడుకుంటామని వారి మీద ఈగ వాలినా సహించమని ఆయన చెప్పడాన్ని కూడా విశేషంగానే చూస్తున్నారు. ఏపీలో కూటమి అధికారంలో ఉంది. పిఠాపురంలో మిత్రపక్షం ఉంది. మరి టీడీపీ క్యాడర్ మీద ఈగ వాలనివ్వను అని వర్మ ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు అన్నది కూడా చర్చించుకుంటున్నారు.

మరో వైపు చూస్తే వర్మ తెలివిగానే వ్యవహరించారు అని అంటున్నారు. ఆయన పార్టీని వీడిపోవాలని ఎవరైనా అనుకుంటే అది తప్పు అని నిరూపించారని అంటున్నారు. వర్మ పార్టీని వీడాలని కనుక డెసిషన్ తీసుకుంటే అది ఆయనకు రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యంగానే ఉండేది అని అంటున్నారు. కానీ ఆయన అలా కాకుండా జై చంద్రబాబు జై లోకేష్ అంటూ ఫుల్ రీచార్జితో ముందుకు రావడంతో పిఠాపురం సైకిల్ మళ్ళీ పరుగులు తీస్తుందని అంటున్నారు.

అంతే కాదు వర్మకు మరింతగా టీడీపీ అధినాయకత్వం వద్ద మార్కులు పడతాయని అంటున్నారు. నిజానికి చూస్తే వర్మకు లోకల్ గా జనసేన నేతలకు మధ్య గ్యాప్ ఉంది తప్ప ఆ పార్టీ పెద్దలతో లేదని అంటున్నారు. ఇక ఎమ్మెల్సీ దక్కని వర్మ పార్టీని ధిక్కరిస్తే ఒక విధంగా నష్టపోయి ఉండేవారు అని అంటున్నారు. ఆయన టీడీపీకి దూరం కావాలని కోరుకునే వారి ఆశలను నిరాశ చేస్తూ తాను ఎప్పటికీ బాబుకు భక్తుడినే అని పక్కా క్లారిటీతో వర్మ స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు. ఏది ఏమైనా వర్మ నోట పవన్ మాట రాకపోవడం పట్ల అయితే చర్చ సాగుతోంది. చూడాలి మరి రానున్న రోజులలో పిఠాపురంలో పాలిటిక్స్ ఏ రేంజిలో సాగుతుందో.

Tags:    

Similar News