ఫోన్ వాడని జగన్ కు వాట్సాప్ తెలుసా? లోకేశ్ ఫన్నీ కామెంట్స్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై మంత్రి లోకేశ్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఫోన్ వాడని జగన్ వాట్సాప్ గవర్నస్ కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

Update: 2025-02-05 04:45 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై మంత్రి లోకేశ్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఫోన్ వాడని జగన్ వాట్సాప్ గవర్నస్ కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. తాను ఫోన్ వాడనని గతంలో స్వయంగా జగన్ చెప్పారని, అలాంటి ఆయనకు వాట్సాప్ పాలన విలువ ఏం తెలుస్తుందని దెప్పిపొడిచారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసేందుకు వెళ్లిన లోకేశ్.. వాట్సాప్ గవర్నెస్ పై వైసీపీ చేస్తున్న విమర్శలపై స్పందించారు.

ఏపీలో ఇటీవల వాట్సాప్ పాలనను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మన మిత్ర పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ పోర్టల్ ద్వారా 161 పౌరసేవలు సులభంగా వాట్సాప్ లో పొందొచ్చు. దీనిపై మేటాతో గత ఏడాది అక్టోబరులో ఒప్పందం చేసుకోగా, గత నెల 31వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెస్ అందుబాటులోకి వచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. కేంద్ర ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కూడా వాట్సాప్ గవర్నెస్ ను అభినందించారు. ఈ సేవలను మరింత పకడ్బందీగా అమలు చేయడంతోపాటు ఆదాయ ఆర్జనకు ఆయన కొన్ని సూచనలు చేశారు.

లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు తెలుసుకున్నారు. ఆ సమయంలోనే కొన్ని రకాల సర్టిఫికెట్లను సులభంగా జారీ అయ్యేలా చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. అధికారంలోకి రాగానే వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించుకుని రికార్డు సమయంలో అమలులోకి తెచ్చారు. ఈ ఆలోచన పూర్తిగా లోకేశ్ దే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బహిరంగంగా ప్రకటించారు. కానీ, వాట్సాప్ గవర్నెస్ ను తాము గతంలోనే అమలు చేశామని వైసీపీ ప్రచారం చేసుకుంది. ఈ స్కీమ్ క్రెడిట్ ను కొట్టేయాలని చూసింది. వాట్సాప్ గవర్నెస్ అందుబాటులోకి రాగానే అది జగన్ ఆలోచనేనంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది.

ఈ విషయాన్ని ఢిల్లీలో మీడియా ప్రతినిధులు లోకేశ్ దృష్టికి తేగా, ఆయన ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ఫోన్ వాడనని చెప్పిన జగన్ వాట్సాప్ గవర్నెస్ తెచ్చారంటే నమ్మాలా? అంటూ ప్రశ్నించారు. ఇక వాట్సాప్ గవర్నెస్ ద్వారా డేటా చౌర్యం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించడాన్ని తప్పుబట్టారు. డేటా చౌర్యం జరుగుతున్నట్లు నిరూపిస్తే రూ.10 కోట్లు బహుమతి ఇస్తానని ప్రకటించారు. గతంలో కూడా డేటా చౌర్యంపై వైసీపీ ఆరోపణలు చేసిందని, కానీ, ఐదేళ్ల అధికారంలో నిరూపించలేకపోయిందని విమర్శించారు లోకేశ్.

Tags:    

Similar News