కార్పొరేట్ డైరెక్టర్ ను రూ.6 కోట్లకు ముంచేసిన ‘హైదరాబాద్ అనిత’
షాకిచ్చే ఈ ఉదంతం.. ఆన్ లైన్ స్నేహాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తాయి.;

ఆఫ్ లైన్ ప్రేమలు సరిపోనట్లు.. ఆన్ లైన్ ప్రేమలు ఎంతలా ఎక్కువ అయ్యయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రేమల్లో లవ్ ఉండదా? అంటే నూరు శాతం గ్యారెంటీ ఉండదు. అదే సమయంలో రిస్కు ఎక్కువగా ఉంటుంది. ఏమరుపాటు మిస్ అయి గుడ్డిగా నమ్మితే మొత్తంగా మోసపోవటం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితే నొయిడాకు చెందిన ఒక కార్పొరేట్ డైరెక్టర్ కు ఎదురైంది. ఆన్ లైన్ లో పరిచయమైన హైదరాబాద్ అనితతో ప్రేమాయణం సదరు వ్యక్తికి ఏకంగా రూ.6.3కోట్లు ముంచేసిన పరిస్థితి. షాకిచ్చే ఈ ఉదంతం.. ఆన్ లైన్ స్నేహాల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పేస్తాయి. అసలేం జరిగిందంటే..
నొయిడాకు చెందిన దల్జీత్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీ కేంద్రంగా పని చేసే ఒక కార్పొరేట్ కంపెనీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఇప్పటికే విడాకులు అయ్యాయి. దీంతో.. ఒక డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో అనిత అనే పేరుతో ఒక మహిళ పరిచయమైంది. ఆమె తనది హైదరాబాద్ గా చెప్పుకున్నారు. ఇద్దరి మధ్య కొన్నాళ్లు మాటలు సాగాయి. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.
తనను పూర్తిగా నమ్ముతున్నట్లుగా గ్రహించిన హైదరాబాద్ అనిత తన పథకాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. ట్రేడింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడితే.. తక్కువ కాలంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించొచ్చన్న మాట చెబుతూ.. మూడు వెబ్ సైట్ల గురించి చెప్పింది. ఆమె మాటల్ని నమ్మిన దల్జీత్ తొలుత ఆయా కంపెనీల్లో రూ.3.2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. గంటల వ్యవధిలోనే రూ.24వేలు లాభం రావటంతో ఆ మొత్తాన్ని తిరిగి తన బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేసుకున్నాడు.
ఈ లాభాలతో హైదరాబాద్ అనిత మీద మరింత గురి పెరిగింది. ఆమె సలహాతో తాను దాచుకున్న రూ.4.5 కోట్ల పొదుపుతో పాటు రూ.2 కోట్ల రుణాన్ని తీసుకొని విడతల వారీగా రూ.6.5 కోట్ల మొత్తాన్ని ట్రేడింగ్ లో పెట్టాడు. అందులో లాభాలు వచ్చినట్లు కనిపించినా.. వాటిని తన ఖాతాలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. పెట్టుబడిలో కేవలం 30 శాతం మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలు ఉంటుందన్న మెసేజ్ వచ్చింది.
అలా ఎలా కుదురుతుందంటూ దల్జీత్ 30 శాతం తిరిగి తీసుకునేందుకు నో చెప్పాడు. ఆ తర్వాత నుంచి అతను ఎంత విత్ డ్రా చేసుకుందామని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అంతేకాదు.. అతడికి మరో షాక్ తగిలింది. అనిత చెప్పిన మూడు వెబ్ సైట్లు డౌన్ అయ్యాయి. దీంతో విషయం అర్థమైన దల్జీత్ సైబర్ పోలీసుల్ని ఆశ్రయించారు. అతడిచ్చిన ఫిర్యాదును తీసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మరో షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. హైదరాబాద్ అనిత ప్రొఫైల్ కూడా ఫేక్ గా తేల్చారు. సో.. ఆన్ లైన్ స్నేహాల్ని ఇక్కడ జడ్జ్ చేయటం లేదు. అలా అని.. గుడ్డిగా నమ్మటం ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.