20 నెలలుగా శాఖనే లేని మంత్రి.. ఇదేం విడ్డూరం సామీ!

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు, పంజాబ్ క్యాబినెట్ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలి వాల్ కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. రెండు శాఖలను కేటాయించారు.

Update: 2025-02-22 09:35 GMT

పంజాబ్ లో ముక్కున వేలేసుకునే ఓ సంఘటన చోటుచేసుకుంది. అసలు శాఖనే లేకుండా 20 నెలలుగా ఓ మంత్రిని ఆ స్థానంలో కూర్చుండబెట్టారు. వింత ఏంటంటే.. ఆ మంత్రి ఆ శాఖలోకి కనీసం తొంగి చూడలేదు. ఉందా? అని కూడా వెళ్లి సమీక్షలు చేయలేదు. ఇలా పంజాబ్ ప్రభుత్వంలో ఓ మంత్రి ఎంత డమ్మీగా వ్యవహారించారా? అన్న విషయం ఆఖరుకు వాళ్లే గుర్తు పెట్టి నాలుక కరుచుకున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. కానీ విషయం బయటకు పొక్కి నవ్వుల పాలయ్యారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకుడు, పంజాబ్ క్యాబినెట్ మంత్రి కుల్దీప్ సింగ్ ధాలి వాల్ కు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. రెండు శాఖలను కేటాయించారు. కానీ సమస్య ఏమిటంటే, వాటిలో ఒకటి అసలు లేదని తేలింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం దీనిని గుర్తించడానికి , అధికారికంగా సవరణలు చేయడానికి దాదాపు 20 నెలలు పట్టింది.

పంజాబ్ ప్రభుత్వం మంత్రి కుల్దీప్ సింగ్ ధాలి వాల్ కు కేటాయించిన పరిపాలనా సంస్కరణల శాఖ "అస్థిత్వంలో లేదని" ప్రభుత్వం అంగీకరించింది. ధాలి వాల్ ఇప్పుడు కేవలం ఎన్నారై వ్యవహారాల శాఖను మాత్రమే నిర్వహిస్తారు. మొదట్లో ఆయనకు వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు. కానీ 2023 మేలో జరిగిన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆ బాధ్యతలు తొలగించబడ్డాయి. అనంతరం ఆయనకు ఎన్నారై వ్యవహారాల శాఖతోపాటు పరిపాలనా సంస్కరణల శాఖ బాధ్యతలను అప్పగించారు.

2024 సెప్టెంబర్‌లో మరోసారి క్యాబినెట్ మార్పుల సమయంలో కూడా ధాలి వాల్ కు ఈ రెండు శాఖలను కొనసాగించారు. అయితే, పరిపాలనా సంస్కరణల శాఖ అసలు లేనిదని ఇప్పుడే బయటపడింది.

ఈ అంశంపై భారతీయ జనతా పార్టీ పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. దాదాపు రెండు సంవత్సరాల పాటు లేని శాఖను ఒక మంత్రి ఎలా నడిపారని ప్రశ్నించింది. "ఆప్ పంజాబ్ పాలనను ఓ వాడివేడి జోకుగా మార్చేసింది! 20 నెలల పాటు ఆప్ మంత్రి లేని శాఖను నడిపారు! దాదాపు 20 నెలల పాటు ముఖ్యమంత్రి కూడా ఒక మంత్రి లేనిపోనిది శాఖను నడిపిస్తున్నాడనే విషయం గ్రహించలేకపోయారు," అని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి విమర్శించారు.

"ఒక లేని శాఖలో 20 నెలలపాటు పని చేయడం ద్వారా పంజాబ్ ప్రభుత్వంలో ఎంతటి గందరగోళం ఉందో ఊహించవచ్చు. అర్వింద్ కేజ్రీవాల్ ఓ మోసగాడు, అతన్ని ప్రజా జీవితంలో నుండి నిషేధించాలి" అని బీజేపీ నేత అమిత్ మాల్వీయ ట్వీట్ చేశారు.

అమెరికా అక్రమ భారతీయ వలసదారులను వెనక్కి పంపడం ప్రారంభించినప్పటి నుండి, ఫిబ్రవరి 5న అమృతసర్‌కు అమెరికా నుంచి వచ్చిన అక్రమ వలసదారులను స్వీకరించాల్సిన పరిస్థితుల్లో ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి ధాలి వాల్ వార్తల్లో నిలుస్తున్నారు.

Tags:    

Similar News