అవుట్ డేటెడ్ జంపింగులు... గతంలో కలిసిన ఫ్యూచర్..!
గత 2019 ఎన్నికలకు ముందు తాము రాజులుగా.. తామే మంత్రులుగా చక్రం తిప్పిన నాయకులు తర్వాత కాలంలో అనూహ్యంగా ఔట్ డేటెడ్ అయిపోయారు.
రాజకీయాలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. నేతల తలరాతలు కూడా అలానే ఉండవు. ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ.. భారీ ఎత్తున సానుభూతి ఉన్నప్పటికీ.. ఒక్కొక్కసారి నాయకులు చేసే చిన్న చిన్న పనుల కారణంగా అవన్నీ తుడిచి పెట్టుకు పోవడం ఖాయం. వారి వల్ల పార్టీలు కూడా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వారిలో ఇప్పుడు జంపింగులు చేరిపోయారు. గత 2019 ఎన్నికలకు ముందు తాము రాజులుగా.. తామే మంత్రులుగా చక్రం తిప్పిన నాయకులు తర్వాత కాలంలో అనూహ్యంగా ఔట్ డేటెడ్ అయిపోయారు.
ఇలాంటి వారిలో గిడ్డి ఈశ్వరి, వంతల రాజేశ్వరి, దాడి వీరభద్రరావు, ఉప్పులేటి కల్పన, సుజయ కృష్ణ రంగారావు, శిద్దా రాఘవరావు వంటి పలువురు ముఖ్య నాయకులు ఉన్నారు. వీరంతా ఒకప్పుడు వారి వారి సామాజిక వర్గాల్లో మంచి పేరు.. పార్టీల పరంగా మంచి నాయకులుగా గుర్తింపు పొందారు. 2019 ముందు తమదైన శైలిలో చక్రం కూడా తిప్పారు. దాడి వీరభ్రదరావు విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన వారంతా 2019 వరకు ఎమ్మెల్యేలుగా ఉన్నవారే. అంతేకాదు.. 2019లో వీరు టీడీపీ తరఫున తరఫున పోటీ కూడా చేశారు.
అయితే.. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. వీరి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. ఏదో ఊహించుకు ని అప్పట్లో పార్టీలు మారారు. వైసీపీ నుంచి టీడీపీ చెంతకు చేరుకున్నారు. పార్టీ అధినేతను మచ్చిక చేసుకుని టికెట్లు సంపాయించుకుని 2019లో పోటీ కూడా చేశారు. భారీ ఎత్తున ప్రచారం కూడా చేసుకున్నారు. రాజకీయాల్లో ఇవి కామనే అయినా.. ప్రజలు పెద్దగా హర్షించినట్టు కనిపించలేదు. అందుకే అందరూ గుండుగుత్తగా ఓడిపోయారు. దీంతో ఇప్పుడు వారంతా ఔట్ డేటెడ్ నాయకులు అయిపోయారు.
ప్రస్తుతం మరోసారి ఎన్నికలు వచ్చాయి. ఈ దఫా అయినా.. విజయం దక్కించుకుని గెలుపు గుర్రం ఎక్కాలని వీరికి ఉన్నప్పటికీ.. అవకాశాలు మాత్రం తలుపు తట్టడం లేదు. జంపింగులు అంతా టీడీపీలోనే ఉన్నారు. వీరిలో శిద్దా రాఘవరావు.. వైసీపీలోనే ఉన్నా.. ఆయనకు టికెట్ దక్కలేదు. దక్కుతుందన్న ఆశ కూడాలేదు. అదే ఆయన టీడీపీలోనే ఉండి ఉంటే.. దర్శి నియోజకవర్గం బంగారు పళ్లెంలో ఆయనకు అందేది.
ఇక, మిగిలిన వారిలో ఎస్టీ నాయకులు కూడా వైసీపీని వీడకుండా ఉండి ఉంటే.. వారి పరిస్థితి మరో విధంగా ఉండేదని అంటున్నారు. ఇదంతా ఎందుకు చర్చకు వస్తోందంటే.. ప్రస్తుతం మరోసారి జంపింగులు ఖాయమనే చర్చ సాగుతున్న వేళ.. గతం అందరి ముందు కదలాడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.