హిమాలయాలకు పోతావా.. పవన్ పై మోడీ వేసిన జోక్ ఇదీ

ఏపీకి డిప్యూటీ సీఎంగా అయ్యాక పవన్ కళ్యాణ్ మారిపోయారు. పూర్తిగా ఆధ్యాత్మిక వాదిగా మారిపోయారు.

Update: 2025-02-20 09:51 GMT

ఏపీకి డిప్యూటీ సీఎంగా అయ్యాక పవన్ కళ్యాణ్ మారిపోయారు. పూర్తిగా ఆధ్యాత్మిక వాదిగా మారిపోయారు. ఆ మధ్య ‘సనాతన ధర్మం’ అంటూ మాల వేసుకొని తిరుపతిలో సభ పెట్టారు. దీక్షకు పూనారు. ఇప్పటికీ పవన్ ఆ ఆధ్యాత్మిక వాదంలోనే ఉంటున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి కాషాయ దుస్తుల్లోనే పవన్ హాజరవడం అందరి దృష్టిని ఆకర్షించింది.


ఢిల్లీలో బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.


ప్రమాణ స్వీకార కార్యక్రమం వేదికపైకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఆశీనులైన ఎన్డీఏ కూటమి నేతలతో ముచ్చటిస్తూ అందరినీ పలకరించారు. ఈ క్రమంలో ఆయన పవన్ కళ్యాణ్ దగ్గర ఆగి, ఆయన ధారణలో ఉన్న కాషాయ వస్త్రాలను గమనించి సరదాగా వ్యాఖ్యలు చేశారు. మోదీ నవ్వుతూ "కొంపదీసి రాజకీయాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోతావా? ఏంటి?" అని వ్యాఖ్యానించారు. దీంతో పవన్ కూడా నవ్వుతూ స్పందించారు. అనంతరం మోదీ "అందుకు ఇంకా చాలా టైమ్ ఉంది.. నువ్వు చేయాల్సిన పని చెయ్యి" అంటూ పవన్‌ను మోడీ ప్రోత్సహించారట...

ఈ ఆసక్తికరమైన సంఘటనను పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో మీడియాతో పంచుకున్నారు. "ప్రధాని మోదీగారు సరదాగా నాకు కాషాయ దుస్తుల గురించి మాట్లాడారు. అది నిజంగా ఒక మంచి జోక్. రాజకీయాల్లో ఇంకా చాలా చేయాల్సిన పనులున్నాయి," అని పవన్ వ్యాఖ్యానించారు.

ఈ ఘటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మోదీ, పవన్ మధ్య ఉన్న అనుబంధాన్ని, జనసేన-బీజేపీ కూటమి భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తుందనే అంశాన్ని ఈ సందర్భం మరోసారి హైలైట్ చేసింది.

Tags:    

Similar News