కేసీఆర్‌కు ఇంకో బాధ.. పవన్ ఏకు మేకు అవతున్నాడు!
అదేంటి.. .ఏపీలో తన రాజకీయాలేవో తాను చేసుకుంటున్న పవన్ కళ్యాణ్... తెలంగాణ రాజకీయాల్లో ఓటమి భారంతో, ఆరోగ్య సమస్యలతో విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ ను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, అటు పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడం.. .మరోవైపు ఆరోగ్య సమస్యలతో ఫాం హౌస్‌కే పరిమితమైన సంతి తెలిసిందే. అయితే, త్వరలోనే కేసీఆర్ కం బ్యాక్ ఉంటుందని, ఆయన తన రాజకీయ చతురతను అప్పుడు ప్రదర్శిస్తారని టీఆర్ఎస్ శ్రేణులు బలంగా విశ్వసిస్తున్నాయి. ఇదిలాఉంటే, తాజాగా ఆయన ఊహించని రీతిలో ఓ ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
అదేంటి.. .ఏపీలో తన రాజకీయాలేవో తాను చేసుకుంటున్న పవన్ కళ్యాణ్... తెలంగాణ రాజకీయాల్లో ఓటమి భారంతో, ఆరోగ్య సమస్యలతో విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ ను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? పైగా ఓ వైపు డిప్యూటీ సీఎంగా మరోవైపు సనాతన ధర్మం విషయంలో బలమైన వైఖరి వినిపిస్తున్న నాయకుడిగా... కేసీఆర్‌ను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అంటే... సనాతన ధర్మం విషయంలోనే. ఆసక్తికరంగా ఇటు పవన్ నేరుగా కేసీఆర్ ను టార్గెట్ చేయట్లేదు. అదే సమయంలో... పవన్ ను కూడా కేసీఆర్ నేరుగా ఢీకొనడం లేదు . కానీ ఈ రెండు వైపులా మాత్రం విమర్శల పర్వం సాగుతోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో తన మార్కు వేసుకుంటూనే ...తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మాన్ని పరిరక్షించే లక్ష్యంతో 'నరసింహ వారాహి గణం' పేరుతో ప్రత్యేక విభాగాన్ని ప్రకటించడమే తాజా రాజకీయ రచ్చకు కారణం. సనాతన ధర్మం పరిరక్షణే తమ నరసింహ వారాహి గణం లక్ష్యమని పేర్కొన్న పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు, సనాతన ధర్మాన్ని అగౌరవపరిచేవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. దీనిపై రిటైర్డ్ ప్రొఫెసర్, పూర్వపు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి సెటైర్లు విసిరారు. "ఏమై పోతాడో ఏమిటో? తమ్ముడు!!.." అంటూ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. నరసింహ వారాహి గణం ఏర్పాటుపై ఘంటా చక్రపాణి చేసిన ఈ కామెంట్లపై జనసేన పార్టీ నేతలు, పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.
ఇటు వ్యక్తిగతంగా ఘంటా చక్రపాణిని అటు గతంలో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నందుకు బీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. 'కేసీఆర్, హ్యాపీగా ఏ గొడవా లేకుండా ఇంట్లో కూర్చున్నాడు కదా , పవన్ కళ్యాణ్ బాదేదో అతను పడతాడు.' అంటూ ఓ నెటిజన్ కాస్త హుందాగా స్పందించారు. 'రెండు చోట్ల ఓడిపోయినోడు.... రాష్ట్ర.. దేశ రాజకీయాల మీద ప్రభావం చూపే స్థాయి కి వచ్చాడు... హిందువులు వారికి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే నే తప్పు అనే మెంటాలిటీ కి వచ్చేసాం...నీ లాంటి వారు నయా పైసా సమాజానికి ఉపయోగ పడక పోగా.... కొన్ని వేల మంది విద్యార్థుల ఉసురు నీకు ఉంది..' అంటూ ఓ పవన్ ఫ్యాన్ ఘాటుగా రియాక్టయ్యారు. 'ఆయన ఏమి అవ్వడు కాని..... నువ్వు చేసినవి బయటకి వస్తె,నువ్వు,నీ బాస్ ఏమైపోతారో.... అంత పెద్ద రెస్పాన్సిబుల్ పోసిషన్ లో కూర్చొని, ఎం చేసావ్ రా నువ్వు...??? నీ పాపం పండింది, చూస్తా ఉండు, విద్యార్థుల ఉసురు తగిలి పోతావ్' అంటూ ఓ నెటిజన్ సంచలన కామెంట్లు చేశారు. మొత్తంగా... గతంలో కేసీఆర్ వల్ల పదవి పొందిన మేధావి చేసిన ఓ ట్వీట్.. ఇప్పుడు ఆయనకే విమర్శలు ఎదురయ్యేలా మారిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.