ఆపరేషన్ కమలం : పవన్ ఆలయాల ప్రదక్షిణం
ఆయన ఈ నెల 12 నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణ భారత దేశ యాత్ర చేపట్టనున్నారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను దర్శించేందుకు కార్యాచరణను రూపొందించారు. ఆయన ఈ నెల 12 నుంచి నాలుగు రోజుల పాటు దక్షిణ భారత దేశ యాత్ర చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఆయన కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారి ఆలయాన్ని సందర్శిస్తారు. అలాగే తమిళనాడులోని మధురై లోని మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. తిరువల్లంలో శ్రీ పరశురామ స్వామి వారి ఆలయాన్ని, అదే విధంగా అగస్త్య జీవ సమాధిని, కుంభేశ్వరస్వామి ఆలయం, కుంభకోణంలో స్వామిమలై ఆలయాన్ని, తురుత్తనిలోని సుబ్రమణ్య స్వామి వారి ఆలయాన్ని సందర్శిస్తారు అని తెలుస్తోంది.
ఇదంతా పవన్ ఆధ్యాత్మిక యాత్రగా సాగుతుందని జనసేన వర్తాలు చెబుతున్నాయి. ఇది పూర్తిగా పవన్ వ్యక్తిగత హోదాలో తీసుకుని చేస్తున్న యాత్రగా పేర్కొంటున్నాయి. అయితే రాజకీయ వర్గాలలో చర్చ మరోలా ఉంది. బీజేపీకి దక్షిణాదిన పట్టు దొరకడం లేదు.
దాంతో ఆ పార్టీ మిత్రుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ద్వారా అది సాధించే పనిలో ఉందని అంటున్నారు. అందుకే ఆపరేషన్ లోటస్ పేరుతో బీజేపీ ఇచ్చిన ఒక కార్యక్రమమే ఈ ఆధ్యాత్మిక యాత్ర కావచ్చు అన్నది ఒక చర్చగా సాగుతోంది. బీజేపీ ఎంతసేపూ హిందూత్వాన్ని నమ్ముకుని ఆ కార్డు తో ముందుకు సాగుతోంది అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో తన రాజకీయ భావజాలాన్ని కూడా బీజేపీకి అనుకూలంగా చేసుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన ఆ మధ్యన సనాతన ధర్మ బోర్డు దేశంలో ఉండాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో పెద్ద బహిరంగ సభ జరిపి వారాహీ డిక్లరేషన్ పేరుతో ఆయన ఈ డిమాండ్ చేశారు.
ఇటీవల మహా కుంభమేళాకు కేంద్ర హోం మంత్రి వచ్చినపుడు సాధువులు మఠాధిపతులు ఇదే డిమాండ్ ని ఆయన దృష్టికి తెచ్చి అమలు చేయాలని కోరారు అంటే పవన్ వంటి బిగ్ ఫిగర్ సినీ సెలిబ్రిటీ ఏపీలో ఉప ముఖ్యమంత్రి నోటి వెంట ఏది వచ్చినా అది జాతీయ స్థాయిలో చర్చకు తావిస్తుందని అర్ధం అవుతోంది అని గుర్తు చేస్తున్నారు.
ఇక బీజేపీ దక్షిణాదిన కేరళ తమిళనాడు, తెలంగాణా ఏపీలలో బలోపేతం కావడానికి బలమైన శక్తిగా పవన్ ని ముందు పెడుతోందని కూడా ప్రచారం సాగుతోంది. ఇక ఆరెస్సెస్ నేతలు అంతా పవన్ సనాతన ధర్మ బోర్డు డిమాండ్ కి పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఆరెస్సెస్ సైతం దక్షిణ భారత దేశంలో బీజేపీ బలపడడానికి పవన్ వంటి చరిష్మా టిక్ లీడర్ అవసరం ఉందని భావిస్తోంది.
ఇక పవన్ కళ్యాణ్ ఈ ఆధ్యాత్మిక యాత్ర సందర్భంగా ఏమైనా ప్రకటనలు కానీ లేదా మీడియా మీట్ సందర్భంగా డిమాండ్లు కానీ చేస్తారా అన్న చర్చ ఉంది. అది కనుక అక్కడ జరగకపోయినా జనసేన ప్లీనరీ వచ్చే నెలలో ఉంది. ఆ రోజున ఆ పార్టీ చేసే తీర్మానాల్లో కచ్చితంగా ఈ అంశాలు ఉండే చాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి పవన్ దక్షిణ భారత దేశంలోని ఆధ్యాత్మిక యాత్రలు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా సాగబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.