పొలిటికల్ బాంబ్‌లు ఎవరి మీద పడబోతున్నాయి..? పొంగులేటి వ్యాఖ్యల్లో నిజమెంత..?
అదే తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మంత్రులు అక్కడికి చేరుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం సౌత్ కొరియా పర్యటనలో ఉంది. అక్కడి రాజధాని సియోల్‌లో హన్ నది పునరుజ్జీవ ప్రాజెక్టును మంత్రులు, అధికారుల బృందం విజిట్ చేసింది. ప్రాజెక్టును సక్సెస్ ఫుల్‌గా తీర్చిదిద్దడంపై స్టడీ చేస్తున్నారు. అదే తరహాలో మూసీని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మంత్రులు అక్కడికి చేరుకున్నారు.
నాలుగు రోజులుగా వీరంతా సియోల్ నగరంలో పర్యటిస్తున్నారు. అక్కడి హన్ నది పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఇదే క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికొద్ది రోజుల్లోనే పెద్ద బాంబ్‌లు పేలబోతున్నాయని బాంబ్ పేల్చారు. అయితే.. పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసింది. రాష్ట్రంలో ఏం జరగబోతోంది..? రాజకీయంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి..? రాజకీయంగా ఎవరు బలి కాబోతున్నారు..? అనేది ఆసక్తికర చర్చ నడుస్తోంది.
తమ పర్యటన ముగిసి హైదరాబాద్ చేరుకున్న తరువాత అయినా.. లేక అంతకుముందే అయినా తెలంగాణలో ఒకటి లేదా రెండు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చేశారు. అయితే అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు.. ధరణి కావచ్చు.. కాళేశ్వరం కావచ్చు.. ఇలా 8 నుంచి 10 అంశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే.. వీటిలో ప్రధాన నాయకులే ఉంటారని తెలిపారు. తొందర పడి నిర్ణయాలు తీసుకోకుండా అన్ని ఆధారాలతో సహా వాటిని ప్రజల ముందు పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఫైళ్లు కూడా సిద్ధం అయ్యాయని చెప్పారు. కక్ష సాధింపు చర్యల్లా కాకుండా.. సాక్ష్యాధారాలతో సహా సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ ఇప్పటికే పూర్తయినట్లు మంత్రి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, ధరణి వంటి అంశాలు కూడా ట్రాక్‌లోనే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఇంతవరకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, ప్రజలు కోరుకునే విధంగా చర్యలు ఉంటాయని తెలిపారు. పూర్తి ఆధారాలతో ఫైళ్లు కదిలాయని, రెండు రోజుల్లోనే చర్యలకు సంబంధించి ప్రజలు కీలక వార్తలు వినబోతున్నారని తెలిపారు. దీంతో శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించినవి అని రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది.
రాష్ట్రంలో గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగింది. పది నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో గత ప్రభుత్వ ఘనకార్యాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలు, ధరణిలో చోటుచేసుకున్న అవకతవకలు, వీఐపీల ఫోన్లు ట్యాపింగ్ చేయడం, జీఎస్టీలో కుంభకోణం.. పలు పథకాల్లో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. ఇప్పటికే చాలా అంశాలపై విచారణ సైతం జరుగుతోంది. లక్షల కోట్ల అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ చాలా సందర్భాల్లోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పొంగులేటి వ్యాఖ్యలతో ఎవరు బలి కాబోతున్నారనేది గులాబీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. ప్రధాన నాయకులే ఉంటారని చెప్పడంతో.. బీఆర్ఎస్‌లో ఏం జరగబోతోంది..? ఎవరిపై ఆ బాంబులు పడబోతున్నాయని చర్చ నడుస్తోంది.