పోసాని కేసు బ్యాక్ గ్రౌండ్ ఇదే.. ఫిర్యాదు చేసింది ఇతడే!

ప్రముఖ సినీనటుడు పోసాని క్రిష్ణమురళిని బుధవారం రాత్రి హైదరాబాద్ లోని నివాసంలో అరెస్టు చేయటం తెలిసిందే.;

Update: 2025-02-28 04:42 GMT

ప్రముఖ సినీనటుడు పోసాని క్రిష్ణమురళిని బుధవారం రాత్రి హైదరాబాద్ లోని నివాసంలో అరెస్టు చేయటం తెలిసిందే. ఇంతకు పోసాని మీద నమోదైన కేసేంటి? దాని వివరాలు ఏమిటి? ఫిర్యాదు చేసింది ఎవరు? అతడు ఇప్పుడు ఏమంటున్నారు? లాంటి ప్రశ్నలకు ఇప్పుడు పూర్తి సమాధానాలు బయటకు వచ్చాయి. పోసాని మీద నమోదైన కేసు బ్యాక్ గ్రౌండ్.. అందుకు దారి తీసిన పరిస్థితులు.. పోలీసులు నమోదు చేసిన వివరాలు..కేసు కట్టిన సందర్భంగా పేర్కొన్న అంశాల్ని చూస్తే..

రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు.. వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించటం.. కులాలు.. సినీ అభిమానుల మధ్య గొడవలకు అస్కారం ఇచ్చేలా పోసాని క్రిష్ణమురళి వ్యవహరించారంటూ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంటకు చెందిన జనసేన నాయకుడు జోగినేని మణి ఈ నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టటం.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయటం..వ్యవస్థీక్రత నేరానికి పాల్పడటం లాంటి అభియోగాలపై పలు సెక్షన్ల మీద కేసు పెట్టారు.

ఆయనపై నమోదు చేసిన సెక్షన్లను చూస్తే.. బీఎన్ఎస్ లోని 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కేసు కట్టారు. పోసానిపై పెట్టిన కేసుల్లో కొన్ని ప్రధాన సెక్షన్ల వివరాల్లోకి వెళితే..

బీఎన్ఎస్ 111(1)

వ్యవస్తీక్రత నేరం. ముఠాగా ఏర్పడి సోషల్ మీడియాల్లో చట్టవిరుద్ధ కార్యకలాపాలతో ఆర్థిక లబ్థి పొందటం

196(1)

కులం.. మతం.. వర్గం.. ప్రాంతాల ప్రాతిపదికన వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం

79

మహిళల ఆత్మగౌరవాన్ని కించపరచాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయటం

192

అల్లర్లు జరగాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం

ఐపీసీ 354 ఏ(1) (4)

మహిళల్ని లైంగికంగా వేధించేలా వ్యాఖ్యలు చేయటం

505(1) (సీ)

ఒక కులం మరో కులంపై నేరానికి పాల్పడేలా అక్రమంగా ప్రేరేపించటం

పలు సందర్భాల్లో పోసాని మాట్లాడిన మాటలు.. వాడిన భాషే ఎక్కువ సెక్షన్ల నమోదయ్యేలా చేసిందంటున్నారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల కిందకే వస్తాయంటున్నారు. అంతేకాదు.. పోసాని ఒక కులాన్ని అవహేళన చేయటంతో పాటు.. సినీ పరిశ్రమను ఒకే కులానికి అపాదించేలా వ్యవహరించినట్లుగా పేర్కొంటూ ఒక ఉదంతాన్ని పేర్కొన్నారు.

ఒకే కులానికి చెందిన వారు ఉండటంతో 2015లో ఆయనకు వచ్చిన నంది అవార్డును తిరస్కరించినట్లుగా పేర్కొన్నారు. జీవో పరిశీలించగా.. ఆయన వ్యాఖ్యలు తప్పు అని తేలినట్లుగా పేర్కొన్నారు. కులాలు.. సినీ హీరోల అభిమానుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయటం.. చర్చల్లోనూ పాల్గొన్నట్లుగా ఆయనపై ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొనటం గమనార్హం. ఫిర్యాదు చేసిన జోగినేని మణి మాట్లాడుతూ పవన్ పై అత్యంత అభ్యంతరకర భాషలో పోసాని చేసిన వ్యాఖ్యలు తమనెంతో బాధ పెట్టాయన్నారు. పవన్ తల్లి.. భార్యలపైనా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.

వైసీపీ సర్కారు హయాంలోనూ పోసానిపై ఫిర్యాదు చేస్తే.. పోలీసులు అసలు కంప్లైంట్లను తీసుకోలేదని.. కొన్నిసార్లు ఫిర్యాదులు తీసుకున్నా చర్యలు లేవన్నారు. అందుకే ఫిబ్రవరి 24న మరోసారి ఫిర్యాదు చేశానని.. ఎంత అసభ్యంగా మాట్లాడారో తెలియజేసే వీడియో ఆధారాల్ని కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రైల్వే కోడూరు పోలీసు స్టేషన్ లో ఆయనపై మరో కేసు నమోదైంది.

మరోవైపు పోలీసులు.. కోర్టుకు సమర్పించిన రిపోర్టులో పోసాని గతంలో చేసిన వ్యాఖ్యలు కొన్నింటిని ప్రస్తావించారు. ‘నా పిల్లల్ని దళితులతో ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేయను. వారితో ఎలాంటి సంబంధాలు కుదుర్చుకోను’ అంటూ దారుణ రీతిలో వ్యాఖ్యానించారు. దళితుల్ని కించపరిచేలా.. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో రాజకీయ నాయకుల్ని.. వారి కుటుంబాల్లోని మహిళల్ని అసభ్య పదజాలంతో దూషించారు. వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కంప్లైంట్లు చేశారని.. ప్రస్తుతం ఆయనపై 14 కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పాలకొండ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినా.. అందుకు పోసాని స్పందించలేదని పేర్కొన్నారు. ఇది.. ఆయనకు చట్టమంటే గౌరవం లేదని తెలుస్తోందన్నారు.పోలీసుల విచారణకు ఆయన సహకరించలేదని.. సినీ రంగానికి చెందిన ఆయన.. తన మాటలతో చాలామందిపై ప్రభావాన్ని చూపుతారన్నారు. సమాజంలో విభజన తెచ్చేలా.. ఉద్రిక్తల్ని క్రియేట్ చేసేలా ప్రయత్నించారని.. రిమాండ్ విధించకపోతే ఇవే నేరాలు మరింత వ్యవస్థీక్రతంగా చేస్తారని పేర్కొన్నారు.

Tags:    

Similar News