మోడీని అనే దమ్ము ప్రశాంత్ కిశోర్ కి ఉందా ?
ఎవరీ ప్రశాంత్ కిశోర్ ఏమిటీ ఏపీతో సంబంధం అంటే వైసీపీనే కోరి వెంట తెచ్చుకున్న తంటా అని అనాల్సి వస్తోంది.
ఎవరీ ప్రశాంత్ కిశోర్ ఏమిటీ ఏపీతో సంబంధం అంటే వైసీపీనే కోరి వెంట తెచ్చుకున్న తంటా అని అనాల్సి వస్తోంది. 2019లో ఆ పార్టీ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే 2024 నాటికి అదే పార్టీకి విలన్ గా మారిపోయారు. ఏకంగా ఫ్యాన్ రెక్కలు విరిచేసేలా మాటలతో దాడి చేస్తున్నారు.
వైసీపీ ఓటమికి కంకణం కట్టుకున్నట్టుగా నోటితోనే శాపాలు పెడుతున్నారు. పోలింగ్ కి ముందు పోలింగ్ తరువాత ఇలా రెండు రోజులకు ఒక తడవ వంతున వైసీపీ ఓటమిని తలుస్తూ ఆ పార్టీలో కలవరం రేపుతున్నారు. పార్టీ శ్రేణులను ఒక్కసారిగా డీమోరలైజ్ చేస్తున్నారు.
పొలిటికల్ కన్సల్టేషన్ అనేది ఒక బ్రాండ్ గా మార్చి దేశంలో ఏ పార్టీని అయినా గెలిపించ వచ్చు అని నేర్పించారు పీకే. ఆయనకు ఈ విషయంలో సక్సెస్ రేట్ 90 శాతం దాకా ఉంది. ఐప్యాక్ సంస్థ ద్వారా ఇచ్చిన ప్రతీ ప్రాజెక్ట్ సమర్ధవంతంగానే చేశారు. దేశంలో ఈ రోజు మోడీ చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు అంటే దానికి పీకే సోషల్ మీడియా ద్వారా వాట్సప్ యూనివర్శిటీ ద్వారా చేసిన విపరీత ప్రచారం కానీ మేలు కానీ చాలా ఎక్కువ అని చెప్పాల్సి ఉంటుంది.
అయితే ఈ రోజున దేశంలో ప్రశాంత్ కిశోర్ గురించి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక మోడీకి ఆయన పార్టీకి పొలిటికల్ కన్సల్టెంట్ గా ఉన్న పీకే 2014 ఎన్నికల్లో గుజరాత్ మోడల్ అని చెప్పి గెలిపించేందుకు వ్యూహాలు రచించారు. అవి పూర్తిగా సక్సెస్ అయ్యాయి. సరే పదేళ్ళు దాటింది కానీ ఇప్పటివరకూ గుజరాత్ మోడల్ అంటే ఏంటో ఆ డెవలప్మెంట్ ఏంటో కూడా ఎవరూ చూపించలేదు, ఆ ప్రయత్నం కూడా ఏమీ చేయలేదన్న విమర్శలు ఉన్నాయి.
ఆ పేరుతో ఓట్లు మాత్రం బాగా దండుకున్నారు. బీజేపీ గెలిచి దేశంలో పదేళ్ల పాటు రాజకీయంగా బలపడిపోయింది. మరి గుజరాత్ మోడల్ ఏదీ అని ఏరోజు అయినా పీకే మోడీని ప్రశ్నించారా అన్నదే ఇక్కడ ప్రధాన పాయింట్. అంతే కాదు 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సడెన్ గా తీసుకున్నారు. దాని వల్ల లాభం ఏమిటో తెలియదు కానీ భారీగా నష్టం అయితే జరిగింది.
ఎంతో మంది ఎన్నో విధాలుగా ఇబ్బందుల పాలు అయ్యారు. ఈ విషయంలో అయినా పీకే మోడీని నిలదీశారా అన్నది కూడా అంతా అడుగుతున్న ప్రశ్న. ఇక 2019లో మరోసారి మోడీ దేశంలో ప్రజలను ఆకట్టుకుని ప్రధాని అయ్యారు. మరి ఈ అయిదేళ్ల కాలంలో ఆయన ఏమి చేసారు. దేశంలో ఏమి అభివృద్ధి జరిగింది అన్నది కూడా పీకే ఏమీ ఆలోచించలేదు, ఆ విధంగా ఆయన మోడీని ప్రశ్నించనూ లేదు అని అంటున్నారు.
మోడీ నినాదం మేక్ ఇన్ ఇండియా గురించి కానీ మోడీ చెబుతున్న ఫైవ్ ట్రిపుల్ మిలియన్ డాలర్ల గురించి కానీ జీ 20 సదస్సు గురించి కానీ కనీసంగా కూడా పీకే ఏ రోజూ మాట్లాడలేదు అని అంటున్నారు. అంతే కాదు సీబీఐ ఈడీ వరసబెట్టి రాజకీయ ప్రేరేపితమైన కేసులు పెడుతూ దేశంలోని కీలక నేతలను అరెస్టులు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్న నేపధ్యంలో ఆ విషయాల మీద కూడా ఎందుకు పీకే మాట్లాడటం లేదు అని అంటున్నారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ 2014లో మోడీ చెప్పుకుని వచ్చారు. అది పెద్ద హామీగా మారి యువతను కదిల్చింది. మరి నాడు బీజేపీకి కన్సల్టెంట్ గా ఉన్న పీకే ఆ తరువాత అయినా ఎందుకు ఈ విషయాల్లో జనం తరఫున ప్రశ్నించలేదు అని అంటున్నారు.
పీకేకు ఎంత సేపూ రాహుల్ గాంధీ తప్పులు జగన్ తప్పులు ప్రతిపక్షాల తప్పులు మాత్రమే కనిపిస్తాయి అని అంటున్నారు. వాళ్ళు ఓడుతారు వీరు ఓడుతారు అని ఎంతసేపూ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ బీహారీ బాబుకు దేశంలో బీజేపీని అనే సత్తా లేదా అని అంటున్నారు.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మోడీ మీద మాత్రమే ప్రశాంత్ కిశోర్ సాఫ్ట్ కార్నర్ తో ఉంటూ వస్తున్నారు అని అంటున్నారు. ఆరు నూరు అయినా మరోసారి బీజేపీ గెలుస్తుందని ఆయన తన జోస్యాలను వదులుతూ దేశంలో విపక్ష కూటమిని తగ్గిస్తూ చేస్తున్న ప్రచారాలు వ్యాఖ్యలు అన్నీ ఎవరి మేలు కోసం అని అంటున్నారు.
పీకేకు అసలు ఈ రోజు ఏ లాజిక్ తో ఇవన్నీ చెబుతున్నారు అన్నది మరో ప్రశ్న. ఆయన సర్వేలు చేయడం లేదు, చేతిలో టీం లేదు, పొలిటికల్ కన్సల్టెంట్ గా తాను మానేశాను అని చెబుతూనే ఏపీలో టీడీపీ లాంటి పార్టీలకు తెర చాటున సలహాలు ఇస్తూ జనాలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆయన గతంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ మీద విమర్శలు చేశారు.
ఇపుడు జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. ఆయన ఇంతకీ ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు అన్నదే మేధావుల నుంచి జనాల దాకా వస్తున్న ప్రశ్న. పీకే మోడీని మాత్రం మినహాయించడం దేనికి అని అంటున్నారు. అంటే మోడీ అంటే భయంతో కూడిన భక్తితో కూడిన గౌరవం పీకేకు చాలా ఉందని సెటైర్లు పేల్తున్నాయి.
ఆయనకు సొంత రాష్ట్రం బీహార్ లోనే రాజకీయం మీద పూర్తిగా అవగాహన లేదని ఆయన గెలుపు గుర్రాలను పట్టుకుని పొలిటికల్ కన్సల్టెంట్ గా మారి చేసిన మ్యాజిక్ తో కొంత సక్సెస్ దక్కించుకోవచ్చునని అంతమాత్రాన తానే మహానుభావుడిని అయినట్లుగా పీకే ఇస్తున్న ప్రవచనాలు ఎందుకని అంటున్నారు. మొత్తానికి పీకేకి మోడీ మార్క్ ఫియర్ చాలానే ఉందని కామెంట్స్ అయితే వచ్చి పడుతున్నాయి.