రూ.7,500 కోట్ల ఖర్చు.. 40 కోట్ల మంది భక్తులు.. మధ్యలో వైరస్!

ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు ఒకేచోటకు చేరే మహా కుంభమేళాకు సమయం ఆసన్నమవ్వడం తీవ్ర కలవరం సృష్టిస్తోందని అంటున్నారు.

Update: 2025-01-07 08:30 GMT

అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు, మంత్రులు చెబుతున్నప్పటికీ.. చైనాలోని కొత్త వైరస్ హెచ్ఎంపీవీ విషయంలో భారత్ లో తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయని అంటున్నారు. ఈ సమయంలో.. కోవిడ్ తొలినాళ్ల నాటి సంగతులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సమయంలో కోట్లాది మంది భక్తులు ఒకేచోటకు చేరే మహా కుంభమేళాకు సమయం ఆసన్నమవ్వడం తీవ్ర కలవరం సృష్టిస్తోందని అంటున్నారు.

అవును... ‘చైనాలో వైరస్’ అనే మాట వినిపిస్తే ప్రపంచ దేశాలు ఏ స్థాయిలో ఉలిక్కిపడతాయనేది తెలిసిన విషయమే. కరోనా మహమ్మారి ఆ స్థాయిలో ప్రపంచానికి పలు చేదు జ్ఞాపకాలు మిగిల్చింది. ఈ సమయంలో తాజాగా హెచ్ఎంపీవీ వైరస్ తెరపైకి వచ్చేసరికి భారత్ లో కలవరం మొదలైందని అంటున్నారు. పైగా ఇప్పటికే కర్ణాటకలో రెండు, చెన్నైలో రెండు, గుజరాత్ లో ఒక కేసు నమోదైంది.

ప్రధానంగా చిన్న పిల్లలు, వృద్ధులకు ఇది త్వరగా సోకుతుందని అంటున్నారు. లక్షణాలు కూడా కాస్త అటు ఇటుగా కరోనా వైరస్ ను పోలి ఉంటున్నాయని అంటున్న వేళ.. కొత్త టెన్షన్ ప్రారంభమైంది. ఈ సమయంలో ఇప్పటికే మాస్కులు, శానిటైజర్ల వాడకం మొదలైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 45 రోజుల పాటు సాగనున్న మహా కుంభమేళా తెరపైకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ లో ఈ నెల 13 నుంచి 45 రోజుల పాటు సాగనున్న మహా కుంభమేళాకు ప్రయాగ్ రాజ్ సిద్ధమవుతోంది. ఇక్కడ భక్తుల అవసరాలు, భద్రత విషయంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. దీనికోసం రూ.7,500 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారి సంఖ్యను లెక్కించడానికి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు.

ఇక.. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లు, సుమారు ఒకటిన్నర లక్షల మరుగుదొడ్లు ఏర్పాటూ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో భక్తులకు, పర్యాటకులకు ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 10 వేల బోట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి 40 కోట్ల మంది భక్తులు ప్రయాగ్ రాజ్ కు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా 12 ఏళ్లకోసారి జరిగే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలని వచ్చే కోట్లాది మంది భక్తుల్లో పెద్దవారు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 40 కోట్ల మంది ఒకే ప్రదేశానికి వచ్చి వెళ్లనుండటం.. సరిగ్గా ఇదే సమయంలో హెచ్ఎంపీవీ ఆందోళన కలిగిస్తుండటమో ఈ విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరి ఈ విషయంలో కుంభమేళాకు వచ్చే ప్రతీ భక్తుడికీ ఈ వైరస్ ఉందా లేదా అని పరీక్షించి పంపడం ప్రాక్టికల్ గా సాధ్యమవుతుందా..? అలాకానిపక్షంలో అన్ని దేశాల నుంచీ ప్రజలు రావడం వల్ల వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలోకి చేరుకుంటుంది..? కోవిడ్ సమయంలోనూ మొదట్లో లైట్ తీసుకున్నా, తర్వాత వణికించేసింది కదా..? అలా అని ఈ కుంభమేళాను వాయిదా వేసే పరిస్థితి ఉండదు కదా..? వంటి ప్రశ్నలు ఇప్పుడూ నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

మరి ఇంత క్లిష్టమైన పరిస్థితులుగా మారినట్లు చెబుతున్న వేళ.. మహా కుంభమేళా నిర్వహణ - హెచ్ఎంపీవీ వ్యాప్తిని అడ్డుకోవడం వంటి విషయాల్లో కేంద్ర, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలూ ఎలాంటి నిర్ణయాలు, మరెలాంటి జాగ్రత్తలు తీసుకుంటాయనేది వేచి చూడాలి. ఈ విషయంలో భక్తులు కూడా స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News