మంత్రి పదవి రాకపోవడంపై రఘురామ!

కాగా ఈ విషయమై తాాజాగా ఒక ఇంటర్వ్యూలో రఘురామ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

Update: 2024-07-16 03:00 GMT

గత ఐదేళ్లలో ఏపీ రాజకీయాల్లో బాగా చర్చనీయాంశం అయిన పేరు.. రఘురామకృష్ణంరాజు. వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచి ఏడాది తిరక్కుండానే రెబల్‌గా మారి.. తర్వాతి నాలుగేళ్లు జగన్‌ అండ్ కోను గట్టిగా టార్గెట్ చేశారాయన. ఐతే ఇటీవలి ఎన్నికల్లో ఆయన పోటీ మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ తరఫునే నరసాపురం నుంచి పోటీ చేయాలని ఆశించి భంగపడ్డ రఘురామ.. చివరికి టీడీపీ టికెట్ మీద ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

కట్ చేస్తే ఇటీవలే ప్రభుత్వం ఏర్పాటై మంత్రి పదవుల పంపకం జరిగిపోయింది. రఘురామ మంత్రి పదవి ఆశించినా చంద్రబాబు స్పందించలేదు. కాగా ఈ విషయమై తాజాగా ఒక ఇంటర్వ్యూలో రఘురామ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.

చంద్రబాబుకు క్షత్రియ సామాజిక వర్గం అంటే నచ్చదన్నట్లుగా ఆయన మాట్లాడ్డం గమనార్హం. మీకు మంత్రి పదవి ఎందుకు దక్కలేదని రఘురామను అడిగితే.. ''నాకు పదవి రాకపోవడంపై చాలామంది కామెంట్ చేశారు. ఐతే అన్ని కులాలకూ ఇవ్వలేరు కదా. ఆయన భయపడే కులాలు కొన్ని ఉంటాయి. ఆయనకు నచ్చని కులాలు కొన్ని ఉండొచ్చు. ఏమో మాది నచ్చని కులమేమో. బ్రాహ్మణుల్లో ఎవ్వరికీ ఇవ్వలేదు.

ఎందుకంటే ఆ కులంలో ఎమ్మెల్యేగా ఎవ్వరూ లేరు. కానీ క్షత్రియుల్లో ఆరేడుగురు ఎమ్మెల్యేలున్నారు. అయినా మంత్రి పదవి ఇవ్వలేదు'' అని క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన రఘురామ అన్నారు. ఐతే ఎన్నికల ముందు మరో పార్టీలో టికెట్ రాలేదని.. చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మంత్రి పదవి ఎలా ఆశిస్తారు.. దశాబ్దాలుగా పార్టీ కోసం పని చేస్తూ, పలు దఫాలు ఎమ్మెల్యేలు అయిన సీనియర్లను కాదని రఘురామకు మంత్రి పదవి ఎలా ఆశిస్తారు అని టీడీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో రఘురామను తప్పుబడుతున్నారు.

Tags:    

Similar News