బీజేపీలో పాత సరుకు...రిటైర్మెంట్ ఇచ్చేయాల్సిందేనా ?

ఇదిలా ఉంటే తెలంగాణాలో బీజేపీకి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ అయితే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-03-13 14:30 GMT

పాత నీరు పోయి కొత్త నీరు రావాలన్నది ఒక ముతక సామెత. పాత నీరు ఉంటే కుదిరే వ్యవహారం కాదు. కానీ రాజకీయాల్లో మాత్రం పాత నీరుకే ఎంతో ప్రాముఖ్యత. ఒకసారి పార్టీలో చేరితే చనిపోయేంతవరకూ ఆయనే కీలకంగా ఉంటారు. పదవులు అన్నీ ఆయనకూ తరువాత కుటుంబానికీ. ఈ తరహా రాజకీయాలకు భారతదేశంలోని రాజకీయ పార్టీలు అలవాటు పడ్డాయి.

పాత నీరు పోవాలి కొత్త నీరు రావాలని కొందరు నేతలు ఎలుగెత్తి చాటినా పాతవారిని తొలగించే సాహసం అయితే అధిష్టానాలు చేయలేకపోతున్నాయి. దానికి కారణం పార్టీ మీద వారికి ఉండే పట్టు. దాంతో తాము ఏదైనా చేస్తే ప్రయోగం వికటిస్తుందేమో అన్న ఆందోళనతో కూడా చేయరని అంటారు.

ఇదిలా ఉంటే తెలంగాణాలో బీజేపీకి ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ అయితే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ నుంచి పాత సరుకు బయటకు పోవాలని స్పష్టం చేశారు. ఆ పాత సరుకు పోతేనే కానీ పార్టీ బాగుపడదని ఆయన అంటున్నారు.

తెలంగాణాలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారితో రహస్యంగా భేటీ అవుతున్నారని బాంబు కూడా పేల్చారు. అందువల్లనే బీజేపీ ఎదగడం లేదన్నది రాజాసింగ్ మార్క్ విశ్లేషణ. పాత సరుకుని గుర్తించి వారిని పార్టీ నుంచి బయటకు పంపించాలని లేకపోతే రిటైర్మెంట్ ఇచ్చి మూలన కూర్చోబెట్టాలని రాజాసింగ్ అధినాయకత్వాన్ని కోరుతున్నారు.

అలాంటి ఆపరేషన్ చేస్తేనే తెలంగాణాలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని ఆయన అంటున్నారు. దీని మీద బీజేపీ జాతీయ నాయకత్వం కూడా మంచి ఆలోచన చేయాలని ఆయన అంటున్నారు. ఇక ఈ అభిప్రాయం తనది మాత్రమే కాదని ప్రతీ బీజేపీ కార్యకర్త కూడా ఇదే కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఇంతకీ రాజాసింగ్ ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నదే చర్చకు వస్తున్న విషయం. బీజేపీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న సీనియర్ నేతలు ఎంతో మంది ఉన్నారు. మరి వారిలో ఎవరు పాత సరుకు. ఎవరు అధికార పార్టీతో కుమ్మక్కు అవుతున్నారు అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. నిజంగా అలా చేస్తే కనుక అది పూర్తిగా తప్పు అవుతుంది.

మరి ఈ విషయం ఎంతో క్రమశిక్షణ కలిగిన బీజేపీ పెద్దలకు తెలియదు అనుకోవాలా అన్నది కూడా సందేహంగా ఉంది. బీజేపీ జాతీయ నాయకత్వానికి వేయి కళ్ళు అని చెబుతారు. ఈ విధంగా బీజేపీతో ఉంటూ ఎదుటి పార్టీలో డీలింగ్స్ నెరిపే నేతలు ఎవరైనా ఉంటే కమలం పార్టీ ఇట్టే పట్టేయకుండా ఉంటుందా అన్నది మరో సందేహంగా ఉంది.

అయితే బీజేపీలో రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ నేత మాత్రమే కాదు పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడిగా ఉన్నారు. ఆయన పార్టీ కోసం ఎందాకైనా అని ఉంటారు. వీర హిందూత్వగా కూడా కనిపిస్తారు. అదే సమయంలో తాను ఏదైనా అనుకుంటే ఆయన ఎవరితోనూ రాజీపడరు. ఆఖరుకు సొంత పార్టీ నేతలను కూడా ఆయన ఎదిరిస్తారు. అందుకే గతంలో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని గుర్తు చేస్తారు.

అయితే ముక్కుసూటి విధానాల వల్లనే ఆయనకు ఈ ఇబ్బందులు అంటున్నారు. మొత్తానికి రాజాసింగ్ చెప్పిన మాటలలో వాస్తవం ఉండే ఉంటుంది అని అంటున్న వారూ ఉన్నారు. దాంతో బీజేపీలో పాత సరుకుని అందునా అధికార పార్టీతో చెట్టాపట్టాలు వేసెవారిని గుర్తించి అర్జంటుగా బయటకు పంపించడం బీజేపీ హై కమాండ్ ప్రస్తుత కర్తవ్యం అని అంటున్నారు. మరి ఆ సాహసానికి బీజేపీ సిద్ధపడుతుందా లేకపోతే రాజాసింగ్ ఊరుకుంటారా అన్నది చూడాల్సిందే.

Tags:    

Similar News