రూపాయి సింబల్ కు తమిళనాడు చెక్... తెరపైకి మరో వివాదం!
అవును... జాతీయ విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే.;
దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఇటీవల పార్లమెంటును తాకిన సంగతి తెలిసిందే. జాతీయ విద్యా విధానాన్ని (ఎన్.ఈ.పీ) అమలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నిరాకరిస్తోందనే విషయం పార్లమెంటును కుదిపేసింది. ఈ సమయంలో రూపాయి సింబల్ విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
అవును... జాతీయ విద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఇందులో భాగంగా... తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో రూపాయి సింబల్ ను తొలగించారు. ఆ స్థానంలో "రూ" అనే అర్ధం వచ్చేలా తమిళ అక్షరాన్ని చేర్చారు.
దీంతో... ఈ నిర్ణయాన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. స్టాలిన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. మాతృభాషను కాపాడుకునేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. అయితే... జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారంటూ మరికొంతమంది మాత్రం తాజా నిర్ణయంపై మండిపడుతున్నారు.
ప్రధానంగా... తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్ట్ గా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఈ వ్యవహారం స్టాలిన్ స్పందించారు. తమిళనాడులో మూడో భాషను విద్యార్థులు నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొంతమంది తమను అడుగుతున్నారని అన్నారు.
అయితే... దక్షిణాదిలో మూడో భాషగా హిందీని ప్రవేశపెడుతున్నవారు.. ఉత్తరాదిలో మూడో భాష కింద ఏ భాషను నేర్పుతున్నారో చెప్పడం లేదని.. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎన్.ఈ.పీని అమలు చేస్తే కేంద్రం రూ.2 వేల కోట్లు ఇస్తామంటోందని.. రూ.10వేల కోట్లు ఇచ్చినా అది రాష్ట్రంలో అమలు జరగదని స్టాలిన్ తెగేసి చెప్పారు.
కాగా... విద్యార్థులు మూడు భాషలను నేర్చుకోవాలని ఎన్.ఈ.పీ-2020 సిఫార్సు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కచ్చితంగా రెండు భారతీయ భాషలుండాలి. ఇది అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తిస్తుంది. అయితే తమ విద్యార్థులకు నేర్పాల్సిన భాషలేమిటనేది నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది.