జగన్ కోటరీలో ఉన్నదెవరు? విజయసాయి కోపంలో నిజమెంత?

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కోటరీపై మాజీ ఎంపీ విజయసాయి విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి.;

Update: 2025-03-13 13:30 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ కోటరీపై మాజీ ఎంపీ విజయసాయి విమర్శలు హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ ఓటమికి జగన్ కోటరీయే కారణమంటూ విజయసాయి విమర్శలు గుప్పించడంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. జగన్ కోటరీలో ఉన్నదెవరు? పార్టీకి నష్టం జరుగుతున్నట్లు కోటరీ వ్యవహరిస్తే మిగిలిన నేతలు ఏం చేస్తున్నారు? ఈ విషయం అధినేత జగన్ కు తెలుసా? తనకు అంతా తెలిసీ మిన్నకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ ఓటమి చెందిన నుంచి జగన్ కోటరీపై అనేక విమర్శలు వ్యక్తమైనా తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేసినట్లైంది.

వైసీపీ ఓటమికి పార్టీలో కొందరు నేతల వైఖరే కారణమని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బహిరంగంగానే తమ ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు లోలోపన కుమిలిపోవడమే కాకుండా, తమ సన్నిహితుల వద్ద బోరుమన్నారు. అధికారంలో ఉండగా, అధినేత జగన్ ను కలిసేందుకు ఎలాంటి అవకాశం ఇచ్చేవారు కాదని, కొందరు ముఖ్యులు అధినేత చుట్టూ చేరి తమను దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసేవారు. అయితే ఓటమి అనంతరం తప్పు ఇతరులపై తోసేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పార్టీలో ఓ వర్గం నేతల ఆందోళనలను లైట్ తీసుకుంది. అయితే పార్టీలో ముఖ్యనేతగా పనిచేసిన విజయసాయిరెడ్డి కూడా తాజాగా అవే ఆరోపణలు చేయడంతోనే వైసీపీలో దుమారం రేపుతోంది.

జగన్ సీఎంగా ఉండగా, ఆయన చుట్టూ కొందరు ఓ చట్రాన్ని నిర్మించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ చట్రంలో తాజాగా ఆరోపణలు గుప్పించిన విజయసాయిరెడ్డి కూడా ఒకరనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కోటరీగా ముద్రపడిన విజయసాయిరెడ్డి కూడా అవే ఆరోపణలు చేయడంతో అంతకుమించి అన్నట్లు జగన్ కోటరీ వ్యవహరించిందా? అనే చర్చ జరుగుతోంది. జగన్ సీఎంగా ఉండగా, విజయసాయిరెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి, జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితోపాటు అప్పట్లో సీఎంవోలో పనిచేసిన ఓ కీలక అధికారి కోటరీగా వ్యవహరించేవారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి వైసీపీ రాజకీయ వ్యవహారాలు చూడగ,సజ్జల ప్రభుత్వ వ్యవహారాలు పర్యవేక్షించేవారని చెబుతున్నారు. అలా ఈ ఇద్దరు కోటరీలో ముఖ్య భూమిక పోషించారు. అయితే ప్రభుత్వ వ్యవహారాల్లో తనకు జోక్యం లేకపోవడంతో విజయసాయిరెడ్డి అప్పట్లోనే కొంత అసంతృప్తితో ఉండేవారని ప్రచారం జరిగింది.

ఇక ఎన్నికల తర్వాత ఓటమికి జగన్ చుట్టూ ఉన్న నేతలే కారణమని విమర్శలు వచ్చినా, ఎవరూ స్పందించలేదు. సరికదా అధినేత జగన్ తన చుట్టూ ఉన్న వారికి మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి అధినేతకు దూరమవుతూ వచ్చారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వం గతంలో చోటుచేసుకున్న అక్రమాలను తవ్వితీస్తుండటం, అన్నింటిలోనూ విజయసాయిరెడ్డి A2 అవుతుండటంతో ఆయనలో భయం పట్టుకుందని అంటున్నారు. గత ప్రభుత్వంలో తనను నామమాత్రంగా చేసి అన్నీ తానై వ్యవహరించిన సజ్జలను వదిలేసి ప్రభుత్వం తన వెంట పడటమేంటన్న ఆలోచనతో విజయసాయిరెడ్డి రూటు మార్చినట్లు భావిస్తున్నారు.

ఈ కోపంతోనే విజయసాయిరెడ్డి అధినేత జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారంటున్నారు. తాను కూడా ఓ సభ్యుడిగా వ్యవహరించిన కోటరీపై తానే విమర్శలు చేయడంతో విజయసాయిరెడ్డి వైసీపీలో కాక పుట్టించారు. వైసీపీ అంతర్గత విషయమే అయినా రాజకీయంగా ఈ అంశానికి ప్రాధాన్యం ఉండటంతో కూటమి పార్టీలు, ఇతర నేతలు కూడా వైసీపీ వార్ ను గమనిస్తున్నారు.

Tags:    

Similar News