ఇష్టం లేనివారిపై రంగు చల్లారో..మీకు 'రంగు' పడుద్ది!

ఇక మినీ ఇండియా హైదరాబాద్ లో హోలీ సంబరాలకు అంతే ఉండదు. దాదాపు అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో హోలీ కోసం మహా నగరం ముస్తాబవుతోంది.;

Update: 2025-03-13 12:06 GMT

హోలీ అంటే రంగుల సంబరం.. నలుగురితో కలిసి అత్యంత ఉత్సాహంగా జరుపుకొనే పండుగ.. తెల్లవారు జామున కాముడి దహనం మొదలు.. ఉదయమంతా రంగులు పులుముకుని.. మధ్యాహ్నానికి ఎండలో చెరువులు, బావుల వద్దకు వెళ్లి స్నానాలు చేస్తుంటారు.

దేశ ప్రధాని నుంచి సామాన్యుల వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ హోలీ జరుపుకొంటారు. అయితే, సంబరాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. ఇందులో స్థానిక సంప్రదాయాలు, ఆచారాలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇక గ్రామాల్లో ఏమో కానీ.. నగరాలు, పట్టణాల్లో హోలీ సందడి ఎక్కువ. మరీ ముఖ్యంగా యువతకు పట్టపగ్గాలు ఉండవు. ఈ క్రమంలోనే తెలిసినవారికీ, తెలియనివారికీ రంగులు పూసేస్తుంటారు. అవతలివారు తేలిగ్గా తీసుకుంటే ఓకే.. కానీ, తిరగబడితేనే ఇబ్బంది.

ఇక మినీ ఇండియా హైదరాబాద్ లో హోలీ సంబరాలకు అంతే ఉండదు. దాదాపు అన్ని రాష్ట్రాల వారు ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో హోలీ కోసం మహా నగరం ముస్తాబవుతోంది. రాజస్థానీలు, గుజరాతీలు, పంజాబీలు, బెంగాలీలు తమతమ సంప్రదాయాల్లో హోలీకి సన్నద్ధం అవుతున్నారు.

ప్రజలు ఒకచోట గుమిగూడి జరుపుకొనేది కావడంతో హోలీ పండుగ సందర్భంగా శాంతిభద్రతలపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు దృష్టిసారించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. ఇందులో భాగంగా పరిమితంగా ఆంక్షలను విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి. ఇష్టం లేని వ్యక్తులపై రంగులు చల్లడాన్ని హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నిషేధించారు. రంగులు చల్లుకోవడానికి ఇష్టపడని వాళ్లకు బలవంతంగా వాటిని పూయడం, నీళ్లను చల్లడంపై నిషేధం విధించారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో హోలీ రంగులను చల్లుకోవడంపైనా నిషేధం ఉంది.

వాహనాలపై రంగు చల్లడం లేదా రంగు నీటిని పోయడాన్ని కూడా నిషేధించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా హోలీ జరుపుకోవడంపై ఆంక్షలు ఉన్నాయి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ప్రమాదాలకు దారి తీసేలా బైకులు, కార్లు, వాహనాల్లో తిరగడం, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడడంపై ఆంక్షలు విధించారు. రంగులు చల్లుకోవడానికి ఇష్టపడని వాళ్లకు బలవంతంగా వాటిని పూయడం, నీళ్లను చల్లడంపై నిషేధం విధించారు.

హోలీ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్య నిషేధం విధించారు.

Tags:    

Similar News