నేను ఎవరి ట్రాప్ లోనూ పడను.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తాను ఎవరైనా వేసిన ఉచ్చులో పడే వ్యక్తిని కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2025-03-13 11:59 GMT

అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పాలిటిక్స్ పై రేవంత్ రెడ్డి ఓపెన్ అయ్యారు. తాను ఎవరైనా వేసిన ఉచ్చులో పడే వ్యక్తిని కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. "నాకు గాంధీ కుటుంబంతో మంచి సంబంధం ఉంది, దీన్ని ఫొటోలు తీసుకుని నిరూపించుకునే అవసరం లేదు," అని అన్నారు. తాను ఎవరో తెలియకుండానే పీసీసీ అధ్యక్షుడు, ఆ తర్వాత సీఎం పదవికి ఎంపిక చేశారా? అంటూ ప్రశ్నించారు.

విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంగా, ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్‌ గవర్నర్‌ ప్రసంగానికి హాజరు కాకపోవడాన్ని విమర్శిస్తూ అసెంబ్లీలో చర్చకు రావాలని సూచించారు. డీలిమిటేషన్‌పై మాట్లాడుతూ "ఇది దక్షిణాదికి లిమిటేషన్‌లా మారుతోంది," అని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర హక్కుల విషయాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశాలపై కేంద్రాన్ని నిలదీయడం తన బాధ్యతేనని తెలిపారు.

తెలంగాణలో 'భారత్ సమ్మిట్' పేరిట ఓ భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సమ్మిట్‌కు సుమారు 60 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తదితర ప్రముఖులు హాజరు అయ్యే అవకాశముందని పేర్కొన్నారు.

ఈ సమ్మిట్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉందని, అందుకే విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కలుస్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలో 'మిస్ వరల్డ్' పోటీలు జరగనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ పోటీలు నెల రోజుల పాటు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికారులతో రెండు రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News