లోకేష్ దాని నుంచి బయట పడాల్సిందే !

లోకేష్ గతంలో మాట్లాడితే కొన్ని తప్పులు దొర్లేవి. అలాగే తడబాట్లూ పొరపాట్లూ ఉండేవి. కానీ ఇపుడు మాత్రం ఆయన సాధన చేశారో ఏమో తెలియదు కానీ బాగానే రాణిస్తున్నారు.;

Update: 2025-03-14 00:30 GMT

ఎవరు ఏమనుకున్నా టీడీపీకి భావి నాయకుడు నారా లోకేష్ అన్నది వాస్తవం. ఆయన చంద్రబాబు కుమారుడు. అంతే కాదు తండ్రి బాటలో నడుస్తున్నారు. పార్టీకి 2024 ఎన్నికల్లో విజయం చేకూర్చడంతో యువగళం పాదయాత్ర ద్వారా తన కష్టం ఉందని నిరూపించుకున్నారు. అందుకే 2017 నుంచి 2019 దాకా మంత్రిగా పనిచేసిన దాని కంటే ఇపుడే లోకేష్ కి ఎక్కువ ప్రయారిటీ లభిస్తోంది. ఆయన మాట పార్టీలో ప్రభుత్వంలో చెల్లుబాటు అవుతుంది.

లోకేష్ గతంలో మాట్లాడితే కొన్ని తప్పులు దొర్లేవి. అలాగే తడబాట్లూ పొరపాట్లూ ఉండేవి. కానీ ఇపుడు మాత్రం ఆయన సాధన చేశారో ఏమో తెలియదు కానీ బాగానే రాణిస్తున్నారు. బాగానే మాట్లాడుతున్నారు. అయితే లోకేష్ బాడీ లాంగ్వేజ్ కానీ మేనరిజంస్ కానీ అన్నీ కూడా అచ్చం చంద్రబాబుని పోలి ఉన్నాయన్న కామెంట్స్ వినిపిస్తూంటాయి.

సహజంగా తండ్రి నుంచి కొన్ని లక్షణాలు వస్తాయి. పైగా లోకేష్ కూడా తన తండ్రితో ఎటూ జనాలు పోలిక పెడతారు కాబట్టి ఆయనను అనుసరించడం అనుకరించడం చేస్తూ వస్తున్నారన్న భావన కూడా ఉంది. చంద్రబాబు విషయానికి వస్తే పెద్దగా మాట్లాడేవారు కారు.

ఆయన ఎన్టీఅర్ వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ తనకు అప్పగించిన పనులకే చేసుకుంటూ వెళ్ళేవారు. ఆయన గట్టిగా అయిదు నిముషాలు మాట్లాడడమే ఎక్కువ అన్నట్లుగా ఉండేది. కానీ ఎపుడైతే ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు దక్కించుకున్నారో నాటి నుంచి బాబు తనకంటూ సొంత స్టైల్ ని ఏర్పాటు చేసుకున్నారు

ఏం తమ్ముళ్ళూ అంటూ ఆయన మాట్లాడే తీరు కానీ ప్రత్యర్థుల మీద ఆయన ప్రదర్శించే ఆవేశకావేశాలు కానీ కేవలం బాబుకే చెల్లు అన్నట్లుగా ఉంటూ వచ్చాయి. అలాంటిది బాబుని ఎవరూ అనుకరించడం కంటే కష్టమే అని చెప్పాలి. అయితే లోకేష్ మీద మాత్రం బాబు ప్రభావం అధికంగానే ఉందని చెప్పాలి.

ఆయన మీడియా ముందు మాట్లాడినా లేక సభలో మాట్లాడినా బాబు ధోరణిలోనే తానూ సాగుతున్నట్లుగా కనిపిస్తారు. అయితే బాబు అనుభవం వేరు, ఆయన వయసు వేరు. ఆయన ఆలోచనలు వేరు. ఆయన మాట్లాడితే అతికినట్లుగా ఉండే విషయాలు లోకేష్ మాట్లాడితే కొంత ఇబ్బందిగా అనిపిస్తాయని అంటున్నారు.

ఇక చూస్తే లోకేష్ యువ నాయకుడు. ఈ తరానికి ప్రతినిధిగా ఉండాల్సిన వారు. ఆయన రాజకీయంగా మరింత కాలం పనిచేయాల్సి నాయకుడు. అందువల్ల తనకంటూ సొంత స్టైల్ ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. కేటీఆర్ తెలంగాణాలో కేసీఆర్ వారసుడిగా ఉన్నా తండ్రి ప్రభావం నుంచి బయటపడి సొంత శైలిని అలవరచుకున్నారు. కేటీఆర్ మార్క్ సెటైర్లు కామెంట్స్ ఉంటాయి.

ఇక ఏపీలో చూస్తే వైఎస్సార్ ప్రభావంతో రాజకీయాలు మొదలెట్టిన జగన్ ఆ తరువాత తన సొంత స్టైల్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మార్క్ మ్యానరిజానికి మాస్ డైలాగులకు ఫ్యాన్స్ ఉన్నారు అంటే అలా జగన్ తనను తాను రూపాంతరం చేసుకోవడమే అని అంటున్నారు. ఇక లోకేష్ విషయం తీసుకుంటే ఆయన కూడా ఈ విషయంలో శ్రద్ధ పెట్టాలే కానీ కొత్త ఒరవడితో కూడిన రాజకీయానికి నాంది పలకగలరు అని అంటున్నారు. ఇప్పటికే చాలా వరకూ సక్సెస్ ఫుల్ గా పాలిటిక్స్ ని కొనసాగిస్తున్న లోకేష్ తన సొంత ఇమేజ్ తో సొంత బాటలో కనుక పయనిస్తే ఆయనకు రాజకీయంగా తిరుగు ఉండదని అంటున్నారు.

Tags:    

Similar News