హోలీ రంగులు చల్లొద్దన్నాడు... ఘోరానికి తెగబడ్డారు!

రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో హోలీకి ముందు ముగ్గురు వ్యక్తులు తనపై రంగులు పూసే ప్రయత్నం చేస్తుండగా.. హన్సరాజ్ (25) అనే వ్యక్తి నిరాకరించాడు.;

Update: 2025-03-14 06:09 GMT

హోలీ పండుగ వేళ ఓ ఘోరమైన విషయం తెరపైకి వచ్చింది. హోలీ రంగులు తనపై చల్లొద్దు అని వారించినందుకు ఓ వ్యక్తిపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ సమయంలో అతడిని తీవ్రంగా కొట్టి, గొంతు కోసి చంపేశారు. దీంతో... విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు!

అవును... రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో హోలీకి ముందు ముగ్గురు వ్యక్తులు తనపై రంగులు పూసే ప్రయత్నం చేస్తుండగా.. హన్సరాజ్ (25) అనే వ్యక్తి నిరాకరించాడు. దీంతో... ఆగ్రహించిన ముగ్గురు వ్యక్తులు హన్సరాజ్ పై ఘోరంగా దాడి చేశారు.. అక్కడికీ వారి ఆగ్రహం, మూర్ఖత్వం చల్లారలేదో ఏమో కానీ.. అనంతరం అతడి గొంతు కోసి చంపినట్లు పోలీసులు తెలిపారు.

రాల్వాస్ గ్రామంలోని కలురాం, బబ్లు, అశోక్ అనే ముగ్గురు వ్యక్తులు స్థానిక లైబ్రరీకి వెళ్లారు. అక్కడ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న హన్సరాజ్ పై రంగు పూసేందుకు ప్రయత్నించినప్పుడు అతడు అడ్డు చెప్పడంతో ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా స్పందించిన అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ దినేష్ అగర్వాల్ ఈ హత్య జరిగిన వివరాలు వెల్లడించారు.

ఈ సమయంలో హన్సరాజ్ ని ముగురు వ్యక్తులు కాళ్లతో తన్నుతూ, బెల్టులతో కొట్టారని.. ఆ సమయంలో వారిలో ఒకరు గొంతు కోసి చంపారని తెలిపారు. ఈ సమయంలో ఆగ్రహంతో ఉన్న హన్సరాజ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు.. అతడి మృతదేహంతో నిరసన తెలిపారు. గురువారం తెల్లవారుజామున 1 గంట వరకూ నేషనల్ హైవేని దిగ్భందించారు.

ఈ సందర్భంగా... హన్సరాజ్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో... వారికి పోలీసులు హామీ ఇచ్చి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది!

Tags:    

Similar News