కిమ్ ఓ ‘న్యూక్లియర్’ పవర్..అన్నాడు కాని ట్రంప్ ఏ ఉద్ధేశంలో అన్నాడో
ప్రపంచంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను పాజిటివ్ గా చూసే అతికొద్ది మంది నేతల్లో ట్రంప్ ఒకరని చెప్పొచ్చు.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోటి వెంట వచ్చే మాటలు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి.. ట్రంప్ మాటకారి కాదు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ మరొక్క విషయం ఏమంటే.. సాధారణంగా అమెరికా అధ్యక్షులు అందరికీ రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ అధ్యక్షులు అంటే పడదు. ట్రంప్ మాత్రం దీనికి భిన్నం.
ప్రపంచంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను పాజిటివ్ గా చూసే అతికొద్ది మంది నేతల్లో ట్రంప్ ఒకరని చెప్పొచ్చు. మూడేళ్లుగా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని సాగిస్తూ వచ్చిన పుతిన్.. ట్రంప్ సంధి ప్రయత్నాలతో అకస్మాత్తుగా మెత్తబడ్డారు.
ఇప్పుడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి కూడా ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కిమ్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కిమ్ గురించి ట్రంప్ ఈ మాట అన్నది పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో ట్రంప్ భేటీ సమయంలో కావడం గమనార్హం. కిమ్ తో సంబంధాలను పునరుద్ధరించే ఆలోచన ఉందా? అని మీడియా ప్రశ్నించగా.. ‘ఏం జరుగుతుందో చూద్దాం. కానీ, కిమ్ కచ్చితంగా ఒక న్యూక్లియర్ పవర్’ అని ట్రంప్ బదులివ్వడం గమనార్హం.
అమెరికా శత్రువులైన రష్యా, చైనాతో పాటు ఉత్తర కొరియా కూడా అణ్వాయుధ దేశాలే. దీనిని ఉద్దేశించే కిమ్ ను న్యూక్లియర్ పవర్ అని వ్యాఖ్యానించారా? అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక అణ్వాయుధాలను తగ్గిస్తే అది గొప్ప విజయమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. కిమ్ వద్ద అణ్వాయుధాలు చాలా ఉన్నాయని.. ఎన్ని ఉన్నాయి అనే దానికంటే.. అవి ఇతరుల వద్ద కూడా ఉండడం అవసరమని ట్రంప్ తెలిపారు.
భారత్ ప్రస్తావనతో..
భారత్, పాకిస్థాన్ వంటి ఇతర దేశాల వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయని, వాటిని ఇతరులకూ ఇవ్వాలని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. కాగా, గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉండగా.. కిమ్ విషయంలో తన వైఖరి చాలా ఆశ్చర్యపరిచింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ 2019లో వియత్నాంలో వీరిద్దరూ భేటీ అయ్యారు.
కాగా, వియత్నాం చర్చల్లో అణ్వాయుధాలను వదిలేసే విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గలేదు. దీంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. ఆ మరుసటి ఏడాదే బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు అమెరికా విషయంలో కిమ్ తీరు మరింత కఠినంగా మారింది. ట్రంప్ తో వ్యక్తిగత దౌత్యాలు నడపకూడదని నిర్ణయించారు. కాగా ఉత్తర కొరియా దాయాది, శత్రు దేశం దక్షిణ కొరియాతో తరచూ ఘర్షణలకు దిగుతున్ సంగతి తెలిసిందే. దీంతో దక్షిణ కొరియా-అమెరికా సైనిక విన్యాసాలకు దిగుతున్నాయి. ప్రతిగా ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు చేపడుతోంది. ఈ పరిణామాలతో కొరియా ద్వీప కల్పంలో నిత్యం ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.