అద్భుతః... జనసేన సభలో నోరూరించే ఫుడ్ మెనూ ఇదిగో!
చింతాడలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో ఫుడ్ మెనూ నోరూరిస్తుందని అంటున్నారు. ప్రధానంగా.. వెజ్, నాన్ వెజ్ వంటకాలను గోదావరి వంటకాల స్టైల్లో తయారు చేయించినట్లు చెబుతున్నారు.;
జనసేన ఆవిర్భావ సభకు పిఠాపురం నియోజకవర్గంలోని చింతాడ గ్రామంలోని 50 ఎకరాల సభా ప్రాంగణం సిద్ధమైంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చి, పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ వేడుక కావడంతో.. అంగరంగ వైభవంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈ మేరకు "జయకేతనం" అని ఈ సభకు నామకరణం చేశారు.
ఈ సభ నేడు సాయంత్రం జరగనుంది. ఈ సమయంలో సుమారు 1600 మంది పోలీసులు భద్రతా కార్యక్రమాలు పర్యవేక్షించనున్నారని తెలుస్తోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సభకు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలకు మంచి విందు అందించడానికి పార్టీ పెద్దలు సిద్ధమయ్యారు.
అవును... చింతాడలో జరగనున్న జనసేన ఆవిర్భావ సభలో ఫుడ్ మెనూ నోరూరిస్తుందని అంటున్నారు. ప్రధానంగా.. వెజ్, నాన్ వెజ్ వంటకాలను గోదావరి వంటకాల స్టైల్లో తయారు చేయించినట్లు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులకు గోదావరి వంటకాలు రుచి చూపించనున్నారు!
ఈ సందర్భంగా సభకు వచ్చిన ప్రతీ ఒక్క కార్యకర్త తృప్తిగా భుజించేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా... కోడి వేపుడు, మటన్ బిర్యానీ, చేపల పులుసు, పీతల పులుసు, రొయ్యల ఇగురు వంటి వంటకాలతో పాటు స్టార్టర్స్ తో నాన్ వెజ్ ఫుడ్ స్టాల్ నిండిపోయిందని చెబుతున్నారు. ఇదే సమయంలో శాఖాహార ప్రియులకు ప్రత్యేక భోజనం అందిస్తున్నారు!
ఇందులో భాగంగా... పప్పు, ఆవకాయ, సాంబారు, రోటి పచ్చడి, రసం, మజ్జిక చారు, గ్రేవీ కర్రీతో పాటు గడ్డ పెరుగును కార్యకర్తలకు అందించనున్నారు. ఇక ఈ వేసవిలో కార్యకర్తల దాహార్తిని దృష్టిలో ఉంచుకుని.. మంచినీళ్లు, మజ్జిగ, పలు రకాల పండ్ల ముక్కలు కార్యకర్తలకు నిరంతరం అందచేస్తారు.
కాగా... జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రత్యేక కమిటీల ద్వారా ఈ వేడుక ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. సుమారు 250 మంది ఆశీనులయ్యేలా ఈ సభావేదిక ఉండగా.. ఆహుతుల కోసం గ్యాలరీల్లో కుర్చీలు, ఎల్ఈడీ తెరలు ఏర్పాట్లు చేశారు. ఆరు చోట్ల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
ఇక నాలుగు చోట్ల భోజన వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు. జనసేన డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో ఏడు చోట్ల వైద్యశిబిరాలు, 12 అంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. సుమారు 1,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్ల నిఘా ఉండనుంది.