మాయం చేసిన స్టాలిన్...మరో మమత గానా ?

ఈ విషయంలో తాను ఎంతకైనా అన్నట్లుగా ఉద్యమిస్తున్నారు. మరో వైపు చూస్తే తమిళనాడులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అక్కడ రూపాయి సింబల్ గా హిందీలోనే ఉంటుంది.;

Update: 2025-03-13 22:30 GMT

తమిళనాడు సీఎం స్టాలిన్ ఏడు పదుల పైబడిన వారు ఆయన జీవిత చరమాంకంలో సీఎం పదవి దక్కవచ్చు కానీ ఆయన రాజకీయ అనుభవాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. తండ్రి కరుణానిధి నుంచి ఆయన రాజకీయాలను ఔపాసన పట్టేశారు. ఇదిలా ఉంటే ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తో ఢీ కొడుతున్నారు.

దానికి కారణాలు ఏమిటి ఆయన చెప్పే రీజనింగ్స్ కరెక్టేనా అన్న చర్చ ఒక వైపు సాగుతూండగానే లేటెస్ట్ గా తమిళనాడులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రూపాయి చిహ్నాన్ని మార్చేసి సంచలనం క్రియేట్ చేశారు. హిందీలో ఉన్న రూపాయి చిహ్నాన్ని ఆయన ఏకంగా తమిళంలోకి మార్చేసి హిందీ భాష పట్ల తన వ్యతిరేకత చాటుకున్నారు.

కేంద్రం జాతీయ విద్యా విధానం పేరుతో అమలు చేస్తున్న త్రిభాషా సూత్రాన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని కోరుతోంది. ఇంగ్లీష్ హిందీతో పాటు ఒక స్థానిక భాషను కూడా విద్యార్థులు నేర్వాలని కోరుతోంది. అయితే దానిని స్టాలిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. హిందీని మా మీద బలవంతంగా రుద్దవద్దు అని ఆయన కేంద్రాన్ని కోరుతున్నారు.

ఈ విషయంలో తాను ఎంతకైనా అన్నట్లుగా ఉద్యమిస్తున్నారు. మరో వైపు చూస్తే తమిళనాడులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అక్కడ రూపాయి సింబల్ గా హిందీలోనే ఉంటుంది. దీనిని అన్ని రాష్ట్రాలు అలాగే ఉంచుతాయి. కానీ హిందీ వద్దు అంటున్న స్టాలిన్ మాత్రం బడ్జెట్ లో రూపాయి సింబల్ ని తమిళంలో పెట్టి హిందీని అక్కడ కూడా మాయం చేశారు.

ఈ విధంగా చేయడం ద్వారా తాను ఎంతగా హిందీని వ్యతిరేకిస్తున్నాను అన్నది ఆయన సింబాలిక్ గా చాటి చెప్పారని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక ఎందుకు ఇదంతా స్టాలిన్ చేస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. తమిళనాడులో స్టాలిన్ హిందీ వ్యతిరేకతకు మద్దతు ఎంత అంటే అక్కడ రాజకీయ పార్టీలలో ఏకాభిప్రాయం లేదని అంటున్నారు.

మరో వైపు చూస్తే 2026 మేలో జరగబోయే తమిళనాడు శాసనసభ ఎన్నికల కోసమే స్టాలిన్ ఈ విధంగా రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని సాటి తమిళ విపక్షాలు అనుమానిస్తున్నాయి. అందుకే ఆయన వాదనతో ఏకీభవిస్తున్నా ఆయనతో కలసి ఉద్యమించడానికి మాత్రం ఆలోచిస్తున్నాయి.

ఈసారి తమిళనాడు అస్తిత్వం ఆత్మాభిమానం అన్న దానిని ఆసరాగా చేసుకుని రెండోసారి సీఎం కావాలని స్టాలిన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ ఆయన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్ట్రాటజీని వాడుతున్నారు అని అంటున్నారు. కేంద్రంతో ఢీ కొడుతూ తమ రాష్ట్రాన్ని వెనకేసుకుని రావడం ద్వారా మమతా హ్యాట్రిక్ సీఎం గా ఉన్నారు.

ఆమె బీజేపీని బూచిగా చూపించి ఆ పార్టీని గట్టిగా ఎదురొడ్డి నిలిచిన మహా నాయకురాలిగా తమ రాష్ట్రంలో ఇమేజ్ ని తెచ్చుకున్నారు. బహుశా అదే విధంగా స్టాలిన్ కూడా చేస్తున్నారు అని అంటున్నారు. అయిదేళ్ళ పాటు సీఎం గా పనిచేసిన తరువాత సహజంగానే యాంటీ ఇంకెంబెన్సీ ఆయన ప్రభుత్వం మీద వస్తుంది.

దాంతో దానిని ఎదుర్కోవడానికి ఆయన ఈ విధంగా కేంద్రం మీద రాజకీయ దాడిని మొదలెట్టారు అని అంటున్నారు. అయితే తమిళనాడులో బీజేపీకి ఆంత బలం లేదు. అక్కడ ఆ పార్టీ పెద్దగా పుంజుకోవడంలేదు. మరి తనకు నేరుగా ప్రత్యర్ధిగా లేని బీజేపీని గట్టిగా ఢీ కొనడం వల్ల ఆయనకు ఉపయోగం ఏమైనా ఉందా అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

ఏపీలో 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏపీలో ఉనికిలో లేని బీజేపీ మీద రాజకీయ యుద్ధం చేస్తూ వెళ్ళారు. చివరికి ఆయనకు వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. గాలిలో లేని శతృవుని ఊహించుకుని యుద్ధం చేయడం వల్ల వచ్చిన ఫలితం ఇదని కూడా అంతా అన్నారు.

ఇక చూస్తే మమతా బెనర్జీ కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ తమకు అసలైన ప్రత్యర్ధిగా బీజేపీ ఉంది కాబట్టే పోరాడారు. అలా కేజ్రీ గతంలో గెలిచారు. తాజా ఎన్నికల్లో ఓడారు. మమత మూడు సార్లు గెలిచారు. ఈసారి ఎలా ఉంటుందో తెలియదు. అయితే అదే సమయంలో వీరంతా బీజేపీని బూచిగా చూపించి పరోక్షంగా ఆ పార్టీ తమ రాష్ట్రాల్లో ఎదుగుదలకు కారణం అయ్యారు అని అంటున్నారు.

తమిళనాడులో కూడా బీజేపీని విమర్శిస్తూ ఆ పార్టీకి ఊపిరులూదే కార్యక్రమం ఏదైనా చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా స్టాలిన్ హిందీ వ్యతిరేకతకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అదే సమయంలో దీనిని ఎన్నికల స్టంట్ గా కూడా సాటి పక్షాలు అనుమానించడం కూడా జరుగుతోంది. అయితే స్టాలిన్ ఈ విషయంలో మరింతగా పోరాడి జనంలోకి వెళ్ళి మొత్తం తమిళల మద్దతు కూడగడితేనే ఫలితం వేరేలా ఉంటుంది అని అంటున్నారు.

Tags:    

Similar News